పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వచ్చారు. వచ్చి, ప్రెస్ మీట్ పెట్టారు.. నాలుగు రాజకీయ విమర్శలు చేశారు, ‘ముప్ఫయ్యేళ్ళపాటు అధికారం మాదే’ అంటూ ప్రెస్ మీట్‌లో కామెడీ డైలాగులు పేల్చారు.. మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయారు.
వైఎస్ జగన్ పెట్టే ప్రెస్ మీట్లు, జనానికి బోర్ కొట్టేస్తున్నాయి. కానీ, ఆయన మాత్రం, ‘నేనింతే’ అన్న టైపులో వ్యవహరిస్తున్నారు. అయినా, జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వుండటానికి ఎందుకు భయపడుతున్నట్లు.?
2019 ఎన్నికలకు ముందు హైద్రాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చారు వైఎస్ జగన్. తాడేపల్లిలో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అక్కడే నివాసం వున్నారు. ఆ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచే, రాష్ట్రాన్ని ఐదేళ్ళపాటు పరిపాలించేశారు కూడా.
ఎప్పుడైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం దూరమైందో, అప్పుడే ఆయనకు బెంగళూరు దగ్గరైంది. మామూలుగా అయితే, తాడేపల్లి నుంచి లోటస్ పాండ్‌కి మకాం మారాలిగానీ, హైద్రాబాద్ వెళ్లేందుకు అస్సలు ఇష్టపడటంలేదు వైఎస్ జగన్. ఇది వైసీపీ శ్రేణులకు సైతం మింగుడుపడని విషయం.
సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన.. అంటూ వైసీపీ శ్రేణులు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. కానీ, జిల్లాల పర్యటనపై జగన్ మోహన్ రెడ్డికి ఆసక్తి లేదు. అసలంటూ ఆయనకు రాజకీయాలపై ఆసక్తి వున్నట్లు కనిపించడంలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఇష్టం లేని రాజకీయాలెందుకు చెయ్యాలి.? భయపడుతూ ఏపీ నుంచి బెంగళూరుకి ఎందుకు పారిపోవాలి.? తప్పదన్నట్టు వారానికోసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ సాధించేదేంటి.?