రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా .. ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్ని మహిళా లోకం చీదరించుకుంది. అప్పట్లో ఈ అంశం వైసీపీకి చాలా దెబ్బ కొట్టింది.
అధినేత అలా వుంటే, ఆ పార్టీలో నాయకులు ఇంకెలా వుంటారు.? ఇదిగో, ఇలానే వుంటారని తాజాగా గుడివాడ అమర్నాథ్ నిరూపించారు. హోంమంత్రి అనిత వంగలపూడిని ‘మేకప్ మంత్రి’ అని అభివర్ణించిన గుడివాడ అమర్నాథ్, తన వ్యాఖ్యలు వివాదాస్పదమయినా, పశ్చాత్తాపం ప్రదర్శించలేదు.
‘నేను అనిత వంగలపూడిని మాత్రమే మేకప్ మంత్రి అన్నాను.. మహిళా లోకానికి ఆ వ్యాఖ్యల్ని ఆపాదించవద్దు..’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు తాజాగా గుడివాడ అమర్నాథ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల్లో పశ్చాత్తాప బావన అస్సలు లేదు. పైగా, తాను చేసింది కరెక్టేనని సమర్థించుకుంటున్నారు.
ఇంకా దారుణమైన విషయమేంటంటే, వైసీపీలోని కొందరు మహిళా నేతలు కూడా, గుడివాడ అమర్నాథ్‌ని వెనకేసుకొస్తుండడం. పొరపాటు జరిగిందని ఒప్పుకుని, తన వ్యాఖ్యల్ని గుడివాడ అమర్నాథ్ వెనక్కి తీసుకునేలా పార్టీ అధినాయకత్వం, పార్టీలోని మహిళా నేతలు సుద్దలు చెప్పి వుంటే, వైసీపీకే అది హుందాతనం.
నిజానికి, క్షమాపణ చెప్పకపోయినా, తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు గుడివాడ అమర్నాథ్ చెప్పి వుంటే బావుండేది.
