ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకున్నాం.
అసలేంటి ఈ ఉప ముఖ్యమంత్రి పదవి.? ఈ పదవికి, మిగతా మంత్రులతో పోల్చితే వున్న ప్రత్యేకత ఏంటి.? ఈ ప్రశ్నల చుట్టూ చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి కూడా సాధారణ మంత్రే. ఆయనకంటూ ప్రత్యేకంగా అధికారాలు ఏమీ వుండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో, విభజన ఉద్యమాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రాధాన్యత ఏర్పడింది. విభజనవాదులను ఏమార్చేందుకు అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పదవిని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత, అదో ఆనవాయితీగా మారింది తెలుగు రాష్ట్రాల్లో.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బలపర్చిన టీడీపీ – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. అప్పుడూ ఉప ముఖ్యమంత్రులున్నారు. వైసీపీ హయాంలో అయితే, బోల్డంతమంది ఉప ముఖ్యమంత్రులు పని చేశారు. కాస్తో కూస్తో టీడీపీ – బీజేపీ హయాంలో పని చేసిన ఉప ముఖ్యమంత్రులకే కాస్త గుర్తింపు వుండేది. వైసీపీ హయాంలో ఎవరు ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారో, వైసీపీ నేతలకే గుర్తు లేని పరిస్థితి.
ఇక, ఇప్పుడు మాత్రం.. ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ కళ్యాణ్ ఒక్కరే వున్నారు.. టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ, ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు మాత్రమే ఇచ్చారు.
పదవి ఇస్తే సరిపోతుందా.? ఆ పదవికి ఆయన గౌరవం తీసుకురావొద్దూ.? గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పని చేసినవారు తీసుకురాని గౌరవాన్ని, ఆ పదవికి పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టారు. ‘ఉప ముఖ్యమంత్రి అంటే సీఎం కంటే పవర్ ఫుల్..’ అనే స్థాయికి ఉప ముఖ్యమంత్రి పదవి తాలూకు గౌరవాన్ని పెంచారు.
తిరుపతి లడ్డూ విషయానికొస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.. దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేరే లెవల్‌కి తీసుకెళ్ళారు. మహిళలపై దాడుల విషయంలోనూ, ఇతరత్రా అభివృద్ది కార్యక్రమాల్లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ నిర్ణయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పూర్తి మద్దతు వుంటోంది.
ఉప ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రికి కుడి భుజంలా వుండాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నది అదే. అందుకే, ఉప ముఖ్యమంత్రి పదవి గురించి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పని తీరుకి, సీఎం చంద్రబాబు నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎప్పుడైతే లోకేష్ కూాడా ఉప ముఖ్యమంత్రి అవ్వాలని కొందరు టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారో, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి పదవి కాకుండా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలని టీడీపీ నేతలు కోరుకోవడం ద్వారా, సీఎం పోస్ట్ కంటే డిప్యూటీ సీఎం పోస్ట్ పవర్ ఫుల్.. అని తేలిపోయినట్లయ్యింది.
మరి, ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి అంత పవర్ అద్దింది ఎవరు.? పవన్ కళ్యాణే కదా.! ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులూ ఒప్పుకుంటున్నాయి. ఇంకో నాలుగేళ్ళు ఇదే ఈక్వేషన్ ఇలాగే కొనసాగాలనీ, పవన్ కళ్యాణ్‌ని తక్కువ చేయాలని చూస్తే, అది టీడీపీకే నష్టమని.. టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
మిగతా విషయాల్ని పక్కన పెడితే, డిప్యూటీ సీఎం.. అనే పదవి పట్ల రాష్ట్ర ప్రజలకీ ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. ఆ పదవిలో పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా పని చేస్తుండడం వల్లే ఇదంతా. చంద్రబాబు మంత్రి వర్గంలో ఏ మంత్రి ఇంత బాధ్యతాయుతంగా పని చేసినా, ఆ మంత్రికీ ఇదే గౌరవం దక్కుతుంది.. ఆయా శాఖల గౌరవం పెరుగుతుంది.. టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులందరికీ ఇది వర్తిస్తుంది.