బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా తయారైంది.
తాను నిర్దోషినని నమ్ముతున్నారు చంద్రబాబు. అయినా, ఈ లోకంలో ఏ నిందితుడైనా, తాను దోషినని ఒప్పుకుంటాడా.? ఛాన్సే లేదు. చాలా రేర్ కేసెస్‌లోనే ‘అప్రూవర్’ అనే మాట వినిపిస్తుంటుంది.
ఈ రోజుల్లో ఏదన్నా కేసు విచారణ పూర్తయి, దోషులకు శిక్ష పడాలంటే.. ఏళ్ళ తరబడి సాగే వ్యవహారమే అవుతుందది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసునే తీసుకుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి పదేళ్ళవుతోంది. ఆయనింకా బెయిల్ మీదనే వున్నారు. కేసు విచారణ కొనసాగుతూనే వుంది.
‘బెయిల్ మీదున్న చంద్రబాబు’ అన్న మాట అనిపించుకోకుండా వుండేందుకోసం, క్వాష్ వైపు మొగ్గు చూపుతున్నారాయన. కానీ, క్వాష్ అంత తేలిక కాదు.! ఏ కోర్టు కూడా, విచారణ వద్దే వద్దని చెప్పదు. విచారణ జరగాలి.. తప్పొప్పులు తేలాలి. అదెలాగూ ఈ రోజుల్లో తొందరగా తేలదు గనుక, ‘క్వాష్’ కావాలన్నది చంద్రబాబు పట్టుదల.
కానీ, ఆ క్వాష్ అనేది జరిగే పని కాదు. మరెలా.? పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ‘క్వాష్’ పిటిషన్లు వేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి బంతి సుప్రీంకోర్టులో వుంది. అక్కడేమవుతుందో తెలియదు. రేపటితో సీఐడీ కస్టడీ కూడా చంద్రబాబుకి ముగుస్తుంది.
ఆల్రెడీ రెండ్రోజులు విచారించినట్లవుతుంది గనుక, ఆ తర్వాత ఇంకోసారి చంద్రబాబుని విచారించడం కోసం సీఐడీ, కోర్టును ఆశ్రయించినా, సానుకూల స్పందన న్యాయస్థానం నుంచి రాకపోవచ్చు. అప్పుడిక ఎక్కువ కాలం చంద్రబాబుని, రిమాండ్ ఖైదీగా వుంచడమూ కుదరదు. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో వుండటానికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి.