బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి ఈసారి దిల్ రాజు వేణుకి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తుంది. నితిన్ హీరోగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైనా అదిరిపోతుంది అనిపించేలా ఉందట. ఐతే నితిన్ ఎల్లమ్మ కోసం సాయి పల్లవిని అడిగారట మేకర్స్. ఆమెకు కథ నచ్చినా డేట్స్ క్లాష్ వల్ల సారీ అనేసిందట.
ఐతే సాయి పల్లవి కాకపోతే సెకండ్ ఆప్షన్ గా మహానటి కీర్తి సురేష్ ని లాక్ చేశారని టాక్. కీర్తి సురేష్ కూడా పాత్ర ఎంత బలంగా ఉంటే తను అంత బాగా నటించగలదు. దసరా లో వెన్నెల పాత్రలో మెప్పించిన అమ్మడు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేసింది.
ఆ తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కి ఛాన్సులు రాలేదు. ఐతే ఎల్లమ్మ కోసం కీర్తి సురేష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. నితిన్ మాత్రం ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. రీసెంట్ గా రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఎల్లమ్మ అద్భుతమైన కథ.. ఆ సినిమాలో తను ఎంత బాగా నటిస్తే అంత ఎక్కువ పేరొస్తుందని నితిన్ చెప్పుకొచ్చాడు. సో బలగం వేణు ఎల్లమ్మతో మరో సంచలనానికి సిద్ధం అయినట్టుగానే ఉన్నాడనిపిస్తుంది.