ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా ఉంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబం, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా చూసేందుకు వెళ్ళగా, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా తల్లి ప్రాణాలు కోల్పోయారు.
అసలు సినిమాకి ప్రీమియర్స్ ఎందుకు.? పెయిడ్ ప్రీమియర్స్‌తో ఏం సాధించాలనుకుంటున్నారు.? ఈ చర్చ ఇప్పటిది కాదు.. చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమే. తమ సినిమాపై అపారమైన నమ్మకంతో, ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం అన్నది సర్వసాధారణమైపోయింది.
ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి ప్రముఖుల రాక ఎందుకో తెలుసు కదా.? ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి.. తద్వారా హైప్ పెంచడానికి. సినిమా ప్రమోషన్‌లో భాగమే ఇదంతా. కానీ, ప్రేక్షకుల భద్రత సంగతేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.
సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాట.. అనేది దాదాపు ప్రతి పెద్ద సినిమాకీ సర్వసాధారణమే. కాకపోతే, ప్రాణాపాయం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా విషయానికొస్తే, హైద్రాబాద్‌లోని ఓ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఓ మహిళ ప్రాణాల్ని తీసేసింది.
ముందస్తు సమాచారం లేకుండా, సినీ నటుడు అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్‌కి వెళ్ళడమే ఈ తొక్కిసలాటకి కారణమని సాక్షాత్తూ పోలీసులు వెల్లడించారు. ప్రీమియర్ షో నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశామనీ, తమకు సైతం సినీ నటుడు అల్లు అర్జున్ సమాచారమివ్వకపోవడంతో, అతని చూసేందుకు సినీ అభిమానులు ఒక్కసారిగా ఎగబడేసరికి తొక్కిసలాట జరిగిందని పోలీసులు వివరించారు.
అంతే కాదు, అల్లు అర్జున్ మీద కేసు నమోదయ్యింది. థియేటర్ యాజమాన్యం కూడా ఈ ఘటనలో బాధ్యత తీసుకోవాల్సి వుంది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం అనేది సాధారణంగా జరిగేదే.! కానీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న ఇక్కడ.
ప్రీమియర్ షోలు వేయడం అనేది నిర్మాత ఇష్టం. సినిమా ప్రమోషన్ కోసం రకరకాల పబ్లిసిటీ స్టంట్లూ మామూలే.! కానీ, సినిమా కంటే ప్రాణం చాలా చాలా విలువైనది కదా.! తాజా ఘటన, అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ బ్లాక్ మార్క్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బాధిత కుటుంబానికి తీరని వ్యధ.
పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రీమియర్స్ పేరుతో అనవసర హంగామా ఇకనైనా తగ్గాల్సి వుంది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన పుష్ప, డిసెంబర్ 5న అధికారికంగా విడుదలయ్యింది. కానీ, అంతకన్నా ముందు రోజే.. అంటే, డిసెంబర్ 4న ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.
అర్థరాత్రి ప్రదర్శనలనే కాన్సెప్ట్ కూడా అనవసర ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, ఆ ప్రీమియర్స్ కూడా సరైన సమయాల్లోనే పడితే కొంతవరకు ప్రమాదాల్ని నివారించే అవకాశం వుంటుందేమో.. అన్న వాదనా లేకపోలేదు.