ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే, అత్యంత కిరాతకంగా చంపేశాడు. అసలంటూ చంపేయడమంటేనే కిరాతకం.. రాక్షసత్వం.! అదీ, పబ్లిక్‌గా హత్య చేయడం, అందునా కసి తీరా.. పదే పదే నరుకుతూ పైశాచికానందం పొందుతూ ప్రాణం తీయడం.. అత్యంత హేయం.. దుర్మార్గం. అసలు దారుణాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని వినుకొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనను వీడియో తీశారు కొందరు. ఘటన జరుగుతున్న సమయంలో చాలామంది జనం అక్కడ వున్నారు. కొందరు చోద్యం చూశారు. కొందరైతే అస్సలు పట్టించుకోలేదు. ఎవరూ ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేందుకు సమయం పడుతుంది. ఈలోగా ప్రాణమెలాగూ పోతుంది. ప్రజలకు బాధ్యత వుండాలి కదా.? ప్చ్.. అస్సలు బాధ్యత లేదు. జనంలోనూ పైశాచిక ప్రవృత్తి పెరిగిపోయిందనడానికి ఇదొక నిదర్శనం.. అంతేనా.?
ఏం, వెబ్ సిరీస్‌లలోనూ.. సినిమాల్లోనూ చూసి ఎంజాయ్ చేయట్లేదా.? అంటే, అంతేనేమో.. అలాగే అనుకోవాలేమో.! తప్పెవరిది.? అంటే, నేరం చేస్తున్నవాడితోపాటు.. ఆ నేరాన్ని చోద్యం చూసినట్లు చూసినవారినీ శిక్షించేలా చట్టాలు రావాలనే వాదనలో తప్పేముంది.?
అసలు విషయంలోకి వెళితే, చనిపోయిన వ్యక్తికీ చంపేసిన వ్యక్తికీ మధ్య గతంలో స్నేహం వుండేదట. వ్యక్తిగత వివాదాలు ముదిరి పాకాన పడి, హత్యకు దారి తీసినట్లు పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికులూ అదే చెబుతున్నారు.
కానీ, వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్త చంపేశాడంటూ రాజకీయ దుమారం షురూ అయ్యింది. ఇలాంటి ఘటనల్లో రాజకీయ కోణాన్ని ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది. చంపేసినోడిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా.. వాడు హంతకుడే అవుతాడు.
ఓ ఎమ్మెల్సీ, కొన్నాళ్ళ క్రితం.. తన వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన ఓ యువకుడ్ని చంపేసి, బాధిత కుటుంబానికే ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్సీ, ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నాడు.. ప్రజా ప్రతినిథిగానూ కొనసాగుతున్నాడు.
ఇవే, ఇలాంటి ఘటనలే.. నేర ప్రవృత్తిని పెంచుతాయ్. వాడికి పడని శిక్ష నాకెందుకు పడుతుంది.? అన్న ధైర్యంతో, కొందరు హత్యలకు తెగబడుతుంటారు. పైగా, సదరు ఎమ్మెల్సీకి ఆ పార్టీలో దక్కిన, దక్కుతున్న గౌరవం చూసి, హత్యలు చేయడమంటే హీరోయిజం.. అనుకుంటున్నారు.
ఏదన్నా ఘటన జరిగినప్పుడు, ముందుగా రాజకీయ కోణాన్ని తెరపైకి తీసుకురావడం అనేది ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. దాంతో, పోలీసులకు కూడా ఆయా కేసుల్ని ఛేదించడం సవాల్‌గా మారుతోందనే వాదనా లేకపోలేదు.
ఒక్కటి మాత్రం నిజం.. హత్య, అత్యాచారం.. లాంటి తీవ్రమైన నేరాల్లో, శిక్ష వీలైనంత వేగంగా పడాలి. అదీ కఠినమైన శిక్షలు పడాలి. అయినా, నేరస్తులకి, నేర ప్రవృత్తి వున్నవారికి.. రాజకీయ పార్టీల్లో చోటు ఎలా దక్కుతోంది.? ఎలాగంటే, నేరస్తులే రాజకీయ పార్టీల్ని నడుపుతున్న రోజులివి.. కాబట్టి, నేరం – రాజకీయం.. ఈ రెండిటి మధ్యా విడదీయలేని బంధమేర్పడిపోయింది మరి.!
పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.. ఇవన్నీ ఎలా వున్నా, సభ్య సమాజం తన బాధ్యతని విస్మరిస్తే, నేరస్తుల స్వైర విహారానికి ఆకాశమే హద్దు అవుతుంది. నేరాన్ని చోద్యం చూసినట్లు చూడటమనే రాక్షసత్వాన్ని జన సమూహం అలవాటు చేసేసుకోవడం అత్యంత శోచనీయం.