“శరణాగతి తండ్రీ.. కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతోంది. కలుషితమైన వ్యక్తులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. శ్రీవారి ప్రసాదాలను కళంకితం చేసేసారు. నేను గాని అపరాధం చేసి ఉంటే నేను నా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోవాలి” ఇవి తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయం ఎదుట చేసిన వ్యాఖ్యలు. లడ్డూ వివాదం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. బాగుంది.. అసలు ఆ పని చేయాల్సింది ఎవరు? తిరుమలను ఉద్ధరించి ఇంతటి వివాదానికి కారణమైన వ్యక్తి ఎక్కడ? ప్రసాదాల తయారీలో ఇంత గందరగోళం జరుగుతుంటే పత్తా లేకుండా పోవడమేంటి?.
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఆయన తీరు తెన్నులు వివాదాస్పదమే. అసలాయన ప్రవర్తన వైసీపీ పార్టీ నాయకులకి నచ్చేది కాదు. తిరుమలలో దర్శనం కోసమో లేదా మరేదైనా పని కోసమో ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చెయ్యరు. తిరిగి కాల్ బ్యాక్ కూడా చేయడని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు తమ నాయకుడు జగన్ వద్ద వాపోయేవారట. ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా ధర్మారెడ్డి తీరులో మార్పు వచ్చేది కాదట. అసలు ఆయన ఈవోగా ఉండటానికి సరైన అర్హత ఏంటి అని ఆ పార్టీ నాయకులే ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ ఈవోగా సాధారణంగా ఐఏఎస్ స్థాయి వ్యక్తిని నియమిస్తారు. కానీ కేంద్ర సర్వీసులోనే ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీసెస్( IDES ) కు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమించడం ఆ పార్టీ వాళ్లకే రుచించలేదు. అందుకు తగినట్లుగానే ధర్మారెడ్డి పార్టీలోని పెద్ద తలకాయలను తప్ప మిగిలిన వాళ్ళని లెక్క చేసింది లేదు. ఇప్పుడు నడుస్తున్న లడ్డూ వివాదం లో మొదట సమాధానం చెప్పాల్సింది ఈవోనే. ఆ తర్వాత చైర్మన్ బాధ్యుడు అవుతాడు. చైర్మన్ కరుణాకర్ రెడ్డి తన వంతుగా ప్రమాణం చేసి మమ అనిపించేశాడు. మరి ధర్మారెడ్డి పరిస్థితి ఏంటి?
ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద ఆంధ్రాలో పనిచేస్తున్న ఆయన్ని జూన్ 30 వరకు ఏపీలోనే కొనసాగేలా కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా తిరుమలకి వెళ్లే ముందు ధర్మారెడ్డిని సెలవుపై పంపించేశారు. అప్పటినుంచి ఆయన మాతృత్వ శాఖకి వెళ్ళారా లేదా అన్న సమాచారం కూడా లేదు. ఏదేమైనా.. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు నడుస్తున్న వివాదానికి బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. ఐదేళ్లపాటు తమ నాయకుడికి స్వామి భక్తి ప్రదర్శించిన ధర్మారెడ్డి లాంటి కొందరిని జగన్ వెనకేసుకొచ్చినా చట్టం వదిలిపెట్టదు. ఈ వ్యవహారంలో ఏదైనా తేలితే మాత్రం మొదట ముద్దాయి ధర్మారెడ్డి అవుతాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ స్పందించిన మాదిరిగా మాజీ ఈవో స్పందిస్తే మాత్రం వ్యవహారం వేరేలా ఉంటుంది. ఎందుకంటే వేళ్లన్నీ ధర్మారెడ్డి వైపే ఉన్నాయ్.