‘తోడు దొంగలు ఇద్దరూ జైల్లోనే వుండాలి..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో, కొడాలి నాని కూడా అరెస్టవ్వాలన్న తమ అభిమతాన్ని సోషల్ మీడియా వేదికగా, తమ పార్టీ అదినాయకత్వం ముందుంచుతున్నారు.
వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎలా బూతులతో చెలరేగిపోయారో చూశాం. నిజానికి, వల్లభనేని వంశీతో పోల్చితే కొడాలి నాని ఇంకా దారుణమైన, జుగుప్సాకరమైన మాటలతో టీడీపీపై విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాల విషయంలోనూ వల్లభనేనితో పోల్చితే, కొడాలి నాని మీదనే ఆరోపణలు ఎక్కువ. క్యాసినో ఆరోపణల విషయానికొస్తే, ‘ఇద్దరూ తోడు దొంగలే’ అని టీడీపీనే అప్పట్లో ఆరోపించడం చూశాం.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడికి వ్యూహ రచన చేసినవారిలో కొడాలి నాని కూడా వున్నారని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయ్. అదొక్కటే కాదు, దేవాలయాలపై దాడులకు సంబంధించి కొడాలి నాని చేసిన దిగజారుడు వ్యాఖ్యలూ అన్నీ ఇన్నీ కావు.
అయితే, చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయనీ.. వైసీపీ హయాంలో జరిగినట్లు అడ్డగోలుగా, చట్ట వ్యతిరేకంగా ఏవీ జరగవనీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందేనని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.
అయినాగానీ, తెలుగు తమ్ముళ్ళలో ఆగ్రహావేశాలు మాత్రం చల్లారడంలేదు. వైసీపీ హయాంలో తీవ్రాతి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్న తెలుగు తమ్ముళ్ళు, తమ హయాంలో వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోలేకపోవడం పట్ల కుమిలిపోతున్నమాట వాస్తవం.
మరీ ముఖ్యంగా చంద్రబాబునీ, నారా లోకేష్‌నీ అత్యంత జుగుప్సాకరంగా తూలనాడిన కొడాలి నానిని ఇంకా అరెస్టు చేయలేకపోవడంపై తీవ్ర అసహనానికి గురవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.