జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ, తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి ఇప్పటికిప్పుడు రాజకీయ ప్రత్యర్థి కానే కాదు.! కానీ, ఎందుకు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుని మరీ, విమర్శలు చేసినట్లు.?
ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే (కావాలనే, కవిత ఆ ప్రస్తావన తీసుకొచ్చేలా చేశారని కూడా అనుకోవచ్చు), ‘నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్’ అంటూ తేలిక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అంతే కాదు, చేగువేరా అంటారు.. సనాతన ధర్మం అంటారు.. పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి.. అని కూడా కవిత వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇంతకీ, అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది.? ఎందుకు ఆ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది.? జగన్ మంచోడే, చంద్రబాబు కూడా మంచోడే.. లోకేష్ కూడా మంచోడే.. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలోనే, కవితకి అభ్యంతరాలున్నాయ్.. రాజకీయంగా. ఇదెక్కడి వింత.?
సీరియస్ పొలిటీషియన్ అంటే ఎలా వుండాలి.? లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి కవిత జైల్లో వున్నట్లు, ప్రతి రాజకీయ నాయకుడూ స్కాములు చేస్తే తప్ప, ఆమె సీరియస్ పొలిటీషియన్ అవరేమో.
జాగృతి పేరుతో రాజకీయాల్లో ‘దోపిడీ’కి తెరలేపారన్న విమర్శలున్నాయి కవిత మీద. సినీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి, దందాలకు కవిత పాల్పడ్డారన్న విమర్శలు కోకొల్లలు. సీరియస్ పొలిటీషియన్.. అంటే, ఇలా వుండాలేమో.!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూనే, చట్ట సభలకు ఎన్నికయ్యే అవకాశాన్ని 2014లో వదులుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పుడే, కూటమి అభ్యర్థిగా పోటీ చేసి వుంటే, పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కేంద్ర మంత్రి అయ్యేవారు.
వ్యక్తిగత సంపాదనని, రాజకీయాల్లో.. అది కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. దందాలతో రాజకీయాలు చేసే కవిత, సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు.
వైసీపీకి మరో పేటీఎం కూలీ ‘కవిత’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు పోటెత్తుతున్నాయంటే.. అందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ఎంతైనా బీఆర్ఎస్‌కి వైసీపీ అంటే, మిత్రపక్షం లాంటిదే కదా.! అద్గదీ అసలు సంగతి. అందుకే, అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్.. రెండూ ఓడిపోయాయ్.. మొన్నటి ఎన్నికల్లో.
అన్నట్టు, జనసేన పార్టీకి ఇద్దరు ఎంపీలున్నారు, బీఆర్ఎస్‌కి వున్న ఎంపీల సంఖ్య జీరో.!
