మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే ఇదంతా.
వై నాట్ 175 అని నినదిస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన సీట్లు జస్ట్ 11 మాత్రమే.! సిద్ధం సభల పేరుతో, లక్షలాది మంది జనాన్ని పోగేసి, అప్పటి విపక్ష నేతల బొమ్మలపై వైసీపీ కార్యకర్తలతో ఆయా సభల్లో దాడులు చేయించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సాధించినట్లు.? ప్చ్..ఏమీ లేదు.
2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. కానీ, ఆ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. చూడ్డానికి వచ్చే జనమంతా ఓట్లెయ్యాలనే రూల్ ఏమీ లేదు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చేవారు.
అలా, జనసైనికులు.. జనసేన పార్టీకి నిఖార్సయిన రాజకీయ సైనికులుగా మారేందుకు సమయం పట్టింది. ఓట్లు వేయడమే కాదు, వేయించడం కూడా తెలుసుకున్నారు 2024 ఎన్నికలకొచ్చేసరికి జనసైనికులు. ఫలితం.. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు.. అదే సమయంలో, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గెలుపులోనూ కీలక భూమిక పోషించారు.
జన సందోహం.. జన సునామీ.. జన సంద్రం.. వీటి గురించి, అందరికన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే బాగా తెలుసు. సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు.. ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి చేసి, చూసి వచ్చారు కదా మరి.!
‘జనాన్ని చూస్తున్నారు కదా.. జగనన్న ఓడిపోయారని ఎలా అంటార్రా.?’ అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇంకోపక్క, ‘వీళ్ళందరి ఓట్లూ ఏమైపోయాయ్..’ అని వైసీపీ నేతలు ఆశ్చర్యం నటిస్తున్నారు.
2024 ఎన్నికల్లో ఓటుకి ఐదు వేల రూపాయలకు పైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచినాగానీ, డజను సీట్లు కూడా గెలవలేకపోయింది వైసీపీ. ఇలాంటి కార్యక్రమాలకి జనాల్ని తరలించుకోవడం ఖర్చు దండగ అని తెలిసీ, జగన్ ఎందుకిలా చేస్తున్నారో.. వీటితో ఆయన ఏం సాధిస్తారో.. ఆయనకే తెలియాలి.!