ఎన్డీఏలో చేరికపై జగన్ నిర్ణయం ఏంటి?

థ్యాంక్యూ జగన్‌: ఉత్తరాంధ్రకు ఊపొచ్చింది.!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీఏలో చేరమని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరినందుకు ప్రతిఫలంగా కేంద్రంలో ఒకటో రెండో మంత్రి పదవులు కూడా దక్కుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ కు మోదీ, షా అపాయింట్ మెంట్ ఆగమేఘాల మీద ఖరారు కావడం.. జగన్ ఇరువురితోనూ సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించడం.. ఆ వెంటనే ఏపీ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయడం వంటి పరిణామాలు రాష్ట్రంలో జరగబోయే కీలక పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

ఒక్కో రాష్ట్రం తమ చేతుల్లో నుంచి జారిపోతుండటంతో తత్వం బోధపడిన కమలనాథులు.. తమతో కలిసి వచ్చేవారిని చేజారనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని అంటున్నారు. అయితే, దీనిపై జగన్ నిర్ణయం ఏమిటనేది ఇంకా తెలియడంలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్డీఏలో చేరితే ముస్లిం వర్గాల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉన్నందున బయటి నుంచి మద్దతివ్వడమే మంచిదని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పనిచేస్తే అది పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

అందువల్ల బయటి నుంచి మద్దతిస్తూ బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ పొందాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎన్డీఏలో చేరితో కనీసం రెండు మంత్రి పదవులు వస్తాయని, పైగా కేంద్రంలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన పనులను సులభంగా చేయించుకోవచ్చనే వాదన కూడా వైసీపీలో సాగుతోందని సమాచారం.

ఒకవేళ ఎన్డీఏలో చేరితే సీఏఏ, ఎన్సార్సీలను కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని.. సీఏఏ తాము అమలు చేయబోమని ఇప్పటికే జగన్ ప్రకటించినందున దీనిపై ఎలాంటి వైఖరికి కట్టుబడి ఉండాలనే సందిగ్ధం తలెత్తుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో అంతిమ నిర్ణయం జగన్ దేనని, ఎన్డీఏలో చేరిక అంశానికి సంబంధించిన ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ముస్లింలను దూరం చేసుకునే నిర్ణయం తీసుకుంటారా లేక మధ్యేమార్గంగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదు.