బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చారు తాడేపల్లికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారంటూ, ఆయా నాయకుల్ని అభినందించారు వైఎస్ జగన్.
పనిలో పనిగా, కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలే చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందనీ, అరాచకాలు చేసిందనీ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇదే కామెడీ అంటే.!
వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో, సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్‌చల్ చేస్తూనే వున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించినవారిపై భౌతిక దాడులకు దిగింది వైసీపీ అప్పట్లో.
అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ తదితర నాయకుల్ని పంపి, భౌతిక దాడులకు ప్రయత్నించిన ఘనత వైసీపీదే. చెప్పకుంటూ పోతే, వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ అరాచకాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వానికి అను నిత్యం, న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడేవి.
వైఎస్ జగన్ అలా ప్రవచనాలు చెబుతోంటే, గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిథులు నోరెళ్లబెట్టి చూశారు.
ఇదిలా వుంటే, ‘మనం అధికారంలో వున్నప్పుడు, కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేదదన్న విమర్శ వుంది. మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మల్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఈసారి కార్యకర్తల్ని పట్టించుకుంటాం..’ అంటూ వైఎస్ జగన్, కార్యకర్తల్ని బతిమాలుకున్నారు ఈ సమావేశం సాక్షిగా. ‘2.0’ అంటే ఏమిటో, కార్యకర్తల్ని పట్టించుకోవడమంటే ఏంటో జగన్ చెబితే బావుండేది. కార్యకర్తల్ని పట్టించుకోకపోవడానికి ‘కుంటి సాకు’ కూడా చెప్పారు.. అదే, ‘కోవిడ్’.!
