మీరు మారిపోయార్సార్.. అంటాడో సినిమాలో నటుడు.! వైసీపీ క్యాడర్, ఇప్పుడు అదే మాట తమ అధినేత గురించి అంటోంది.! పాజిటివ్ యాంగిల్‌లో కాదు, నెగెటివ్ యాంగిల్‌లో.! జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి, ‘సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదు’ అంటూ తిరుమల లడ్డూ విషయమై చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్‌కే షాక్ ఇచ్చాయ్.
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే లేఖ రాసేశారు వైఎస్ జగన్. ఇదే డిమాండ్‌తో సుప్రీం తలుపు తట్టారు వైవీ సుబ్బారెడ్డి అలాగే వైఎస్ జగన్‌కి ఆపద్బాందవుడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి.
అసలు విచారణే అవసరం లేదు.. అని వైఎస్ జగన్ భావిస్తే, ఆయనెందుకు సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి లేఖ రాసినట్టు.? ఓ వైపు విచారణ కోరుతూ కోర్టునాశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ విజిలెన్స్ తన మీద చేపట్టిన విచారణను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం, ‘వైఎస్ అవినాష్ రెడ్డి నేరానికి పాల్పడలేదు. ఇంత బలంగా ఎందుకు చెబుతున్నానంటే, అవినాష్ రెడ్డే నాకు చెప్పాడు.. ఆ నేరం తాను చేయలేదని..’ అంటూ వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. అప్పుడే, జస్టిస్ జగన్ రెడ్డి.. అంటూ సెటైర్లు పడ్డాయ్ సోషల్ మీడియాలో.
ఇప్పుడేమో లడ్డూ వివాదానికి సంబంధించి అసలంటూ విచారణే అవసరం లేదని జస్టిస్ జగన్ రెడ్డి చెప్పడం, వైసీపీ క్యాడర్‌కి కూడా షాక్ ఇచ్చింది.
అందుబాటులో లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ వుంది. లడ్డూ కోసం తెచ్చిన నెయ్యి కల్తీ అయ్యిందనీ తేలింది. అంతకు ముందు కూడా కల్తీ అయ్యిందా.? లేదా.? అన్నది తేలాల్సి వుంది. అసలు ఆ నెయ్యి కాంట్రాక్ట్ వివాదాస్పద రీతిలో వేరే కంపెనీకి ఎలా టీటీడీ పాలక మండలి ఇచ్చింది.? అన్నది తేలాలి.
కానీ, ఆ టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేసిన (వైసీపీ హయాంలో) వైఎస్ జగన్ మాత్రం, విచారణే అక్కర్లేదంటున్నారు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ జస్టిస్ జగన్ రెడ్డీ.!