కళ్యాణ్ దిలీప్ సుంకర.. పరిచయం అక్కర్లేని పేరిది. ఈయన ప్రముఖ న్యాయవాది. అంతకన్నా ముందు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. మెగాస్టార్ చిరంజీవి అంటే భక్తి.! నాగబాబుని తండ్రి సమానుడిగా భావిస్తుంటారు కళ్యాణ్ దిలీప్ సుంకర. గతంలో జనసేన పార్టీలో పని చేశారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల జనసేన పార్టీకి దూరంగా వుంటున్నారాయన. అయితే, జనసేన పార్టీ భావజాలాన్ని యూ ట్యూబ్ వీడియోల ద్వారా ప్రచారం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ మీద, ఎవరైనా విమర్శలు చేస్తే, వాటికి కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన స్టయిల్లో తన ‘కామనర్ లైబ్రరీ’ అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కౌంటర్ ఎటాక్ ఇస్తుంటారు.
అయితే, కొన్నాళ్ళపాటు రాజకీయ విశ్లేషణలకు దూరంగా వుంటానంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర వ్యాఖ్యానించడంతో, రచ్చ మొదలైంది. జనసేన పార్టీ ఆయన్ని పట్టించుకోవడంలేదనీ, వేరే ప్రత్యమ్నాయం ఆయన చూసుకోక తప్పదనీ, కొందరు కథనాల్ని వండి వడ్డిస్తున్నారు.
టీడీపీ అధికార ప్రతినిథి మహాసేన రాజేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర లక్ష్యంగా ఓ వీడియో విడుదల చేయడం, దానికి కళ్యాణ్ దిలీప్ సుంకర.. సుతిమెత్తగా కౌంటర్ ఎటాక్ ఇవ్వడం జరిగాయి. జనసేన – టీడీపీ కలిసి పనిచేస్తున్న దరిమిలా, ఈ సమయంలో తన విశ్లేషణలు జనసేన పార్టీకి ఇబ్బందికరం కాకూడదన్న కోణంలో, రాజకీయ విశ్లేషణల్ని కళ్యాణ్ దిలీప్ సుంకర పక్కన పెట్టారు.
అలాగని తాను పవన్ కళ్యాణ్‌కి దూరంగా వుండడం జరగబోదనీ, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ పట్ల అదే అభిమానంతో వుంటాననీ, జనసేన పార్టీకి అవసరమైనప్పుడు, తన సేవలు అందిస్తాననీ చెప్పుకొచ్చారు కళ్యాణ్ దిలీప్ సుంకర. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కళ్యాణ్ దిలీప్ సుంకర పోటీ చేయబోతున్నారు జనసేన నుంచి.. అన్న ప్రచారమైతే కొనసాగుతూనే వుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని కళ్యాణ్ దిలీప్ సుంకరకీ తెలుసు.
ఒకప్పుడు వైసీపీతోపాటు, టీడీపీని టార్గెట్‌గా చేసుకుని కళ్యాణ్ దిలీప్ సుంకర విడుదల చేసిన వీడియోలు, జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మాట వాస్తవం.