Waynad: కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వయనాడ్ లో అర్ధరాత్రి జరిగిన ఘోర దుర్ఘటన దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. మెప్పాడి మండకై ప్రాంతంలో అనేకచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటనలో ప్రస్తుతం 19మంది మరణించారని.. కొండచరియల కింద వందల్లో చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేరళ విపత్తు దళం, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికి 7గురి మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. 50మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలకూ ఆటంకం కలుగుతోంది. పాఠశాలలు నీట మునిగాయి. అర్ధరాత్రి 1గంటకు, తెల్లవారుఝాము 4గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడినట్టు స్థానికులు చెప్తున్నారు.
స్థానిక వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలకు హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు. దాదాపు 500 కుటుంబాలపై దుర్ఘటన ప్రభావం పడిందని అంటున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్లను సంప్రదించాలని కోరారు.