శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం అందరికీ గుర్తుండిపోయే క్షణాలుగా మారింది. సోమవారం జరిగిన ఈ కలయికలో నేతలు, కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పరిచయాలు పెంచుకున్నారు. ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, ప్రాంతాల ప్రత్యేకతలు వంటి అంశాలతో సంభాషణలు సాగి వాతావరణం ఉత్సాహంగా మారింది. శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో మాటలు రక్తికట్టాయి. విందు పూర్తయ్యే వరకూ ఎవ్వరూ బయటకు వెళ్లకుండా సమయాన్ని ఆస్వాదించడంతో సమావేశం మరింత ఆత్మీయంగా మారింది.
ఈ సందర్భంగా మంగళగిరి చేనేత ప్రమోషన్‌పై లోకేష్ ప్రస్తావించగా, శ్రీకాకుళం ప్రజాప్రతినిధులు పొందూరు ఖాదీ విశిష్టతను గుర్తుచేస్తూ మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖాదీ పంచెలను బహుకరించారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులపై తాజా నివేదికలను లోకేష్ వారికి అందజేశారు. నేతల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలను బహుకరించి స్థానిక చేనేతకు ప్రోత్సాహం అందించారు. ప్రాంతీయ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ఈ విందు వేదికగా మారడం విశేషంగా నిలిచింది.
ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కోండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబ వాతావరణంలో సాగిన ఈ సమావేశం ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత బలపరిచిందని పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.



