జగన్ ప్రభుత్వంలో విశాఖ శారదాపీఠంకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సీఎంగా ఉండి మూడు, నాలుగు సార్లు ఈ ఆశ్రమానికి వెళ్లారు. వైసీపీ మంత్రులు, కీలక నేతలు నిత్యం ఆశ్రమంతో టచ్ లో ఉండేవారు. ఒక రకంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆశ్రమం ఓ వెలుగు వెలిగింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఆశ్రమానికి కష్టాలు చుట్టుకుంటాయనేది ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దానికి అనుగుణంగానే తాజాగా ఆశ్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ షాక్ ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వంలో విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలోని రిషికొండకు దగ్గర్లోనే రూ.15 లక్షలకే శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయించింది. అప్పట్లోనే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ భూములపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే ఇక్కడ ఎకరం భూమి రూ.15 కోట్ల దాకా ఉంది. అలాంటిది లక్ష రూపాయలకే ఎకరం భూమి ఎందుకు కేటాయించారో విచారణ చేపట్టాలని ఆదేశించింది.
రెవెన్యూ అధికారులు దీనిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతో వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో తాజాగా రెవెన్యూ అధికారులు భూమిని రికవరీ చేసేశారు.