టాలీవుడ్లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా పలు భారీ చిత్రాలను నిర్మించారు. పెద్ద, చిన్న సినిమాలను వరుసగా నిర్మిస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలను నిర్మించిన నిర్మాతలుగా నిలిచారు. నిర్మాణ సంస్థ ప్రారంభించిన తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాతల సరసన టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిలిచారు.
ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో పాటు పలు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. గత ఏడాది ఈ బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఆర్థిక పరమైన అంశాలపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్ల పై ఎలాంటి స్పష్టత లేదు.
ఈ సమయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వివేక్ కూచిబొట్ల తప్పుకుంటున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వివేక్ కూచిబొట్ల త్వరలోనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ నిర్మాణ సంస్థలో పెద్ద స్టార్స్‌తో సినిమాలను నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వివేక్ కూచిబొట్ల నుంచి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ బయటకు రావడానికి గల కారణం పై ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నింటిపై క్లారిటీ రావాలి అంటే వివేక్ మీడియా ముందుకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.