ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన చేయనున్నారు. ప్రస్తుతానికైతే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచే పరిపాలనా కార్యకలాపాలు నడుస్తున్నాయి. సెక్రెటేరియట్ అక్కడే వుంది. అసెంబ్లీ కూడా అక్కడే వుంది.
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అధికార పక్షం, ప్రతిపక్షం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించాయి. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఒక్క రాజధాని సరిపోదు, మూడు రాజధానులు కావాలంటూ వింత వాదనను తెరపైకి తెచ్చింది.
రాజధాని అమరావతిని ‘కమ్మరావతి’ అంటూనే, ఆ అమరావతిని శాసన రాజధానిగా పేర్కొంది. కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలుని ప్రస్తావిస్తూ, ఓ బిల్లు కూడా రూపొందించి, అసెంబ్లీ, శాసన మండలిలో ‘పాస్ చేయించేసుకున్నాం’ అనిపించేసుకుంది.
కానీ, న్యాయ వివాదాల నేపథ్యంలో, వైసీపీ సర్కారే, మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. అయితే, రాజధాని కార్యకలాపాల్ని విశాఖకు తరలించే దిశగా గత కొద్ది కాలంగా వైసీపీ సర్కారు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. న్యాయ రాజధాని అనేది మాత్రం సోదిలోకి కూడా లేకుండా పోయింది.
రుషికొండపై అత్యాధునిక సౌకర్యాలతో ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయం కోసం సరికొత్తగా భవనాల్ని నిర్మించారు. మరికొన్ని భవనాల్ని ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల నిమిత్తం తాజాగా ఖరారు చేశారు.
త్వరలో ముఖ్యమంత్రి విశాఖకు ‘కాపురం’ మార్చనున్న దరిమిలా, చట్ట సవరణతో సంబంధం లేకుండానే, ‘ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని, పరిపాలనా కేంద్రం..’ అన్న కోణంలో, విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నారు. సో, విశాఖకు రాజధాని కళ వచ్చేసినట్టే.! ఇంతకీ, అమరావతి సంగతేంటి.? కర్నూలు సంగతేంటి. అన్నిటికీ మించి, న్యాయ వివాదాల సంగతేంటి.? ప్చ్.. ప్రస్తుతానికి ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్లే.!