పీరియాడిక్ లవ్ డ్రామా విరాటపర్వం పలుమార్లు వాయిదా పడినా డీసెంట్ బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరో అయినా కూడా సాయి పల్లవి చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. మరి ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా?
కథ:
ఈ విరాటపర్వం కథ 70లలో మొదలై 80, 90ల కాలంలో పరిస్థితులకు అద్దం పడుతుంది. వెన్నెల (సాయి పల్లవి) కొన్ని విపరీత పరిస్థితుల మధ్య జన్మిస్తుంది. వెన్నెలకు నక్సలైట్ నాయకుడు రవన్న (రానా దగ్గుబాటి) సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఆయన రచనలు చదువుతూ, రవన్నను ఆరాధిస్తూ చివరకు ఎన్నో అడ్డంకులు దాటుకుని తనను కలుసుకుంటుంది. వాళ్ళ పోరాటంలో భాగమైన వెన్నెల ప్రేమను రవన్న అంగీకరిస్తాడా? వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరిగాయి? చివరకు ఏమైంది?
నటీనటులు:
ముందే టీమ్ చెప్పుకుంటూ వచ్చినట్లు ఇది సాయి పల్లవి సినిమా. విరాటపర్వంలో ఎక్కువగా హైలైట్ అయ్యేది ఆమె పాత్రనే. దానికి తగ్గ రీతిలోనే సాయి పల్లవి పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి వెన్నెల పాత్రలో తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో ఆమె ఎంత నేర్పరి అనేది మరోసారి అర్ధమవుతుంది.
రానా దగ్గుబాటి నక్సలైట్ లీడర్ రవన్న పాత్రలో మెప్పించాడు. రానా ఒడ్డూ, పొడుగు, తన డైలాగ్ మోడ్యులేషన్ వంటివి సినిమాకు బలంగా నిలిచాయి. ఈ సీరియస్ డ్రామాకు రియలిస్టిక్ అప్రోచ్ ఇవ్వడంలో రానా ప్రధాన భూమిక పోషించాడు.
జరీనా వాహబ్, ప్రియమణి, నవీన్ చంద్ర, ఈశ్వరి రావు, సాయి చంద్, నందిత దాస్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ తదితరులు సినిమాకు అవసరమైన రీతిలో సహాయపడ్డారు. మిగిలిన వాళ్ళు మాములే.
సాంకేతిక వర్గం:
సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గ రీతిలో ఉన్నాయి. తెర వెనుక సురేష్ బొబ్బిలి ప్రధాన బలంగా నిలిచాడు. ఇక విరాటపర్వంకు అందించిన సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా నైట్ షాట్స్, అడివిలో షాట్స్ కు కొత్తదనాన్ని తీసుకొచ్చారు.
ఎడిటింగ్ కూడా పర్వాలేదు. మీడియం బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రచయితగా, దర్శకుడిగా వేణు ఉడుగుల మెప్పిస్తాడు. కొన్ని సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి. అప్పటి పరిస్థితులను చక్కగా చిత్రంలో చూపించాడు. ఎలాంటి డైవర్షన్స్ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి.
పాజిటివ్ పాయింట్స్:
* సాయి పల్లవి, రానా
* సంగీతం
* ఎమోషనల్ క్లయిమాక్స్
* లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
నెగటివ్ పాయింట్స్:
* కమర్షియల్ యాంగిల్ లేకపోవడం
* యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశం కాకపోవడం
చివరిగా:
నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ విరాటపర్వం. రానా, సాయి పల్లవి పెర్ఫార్మన్స్ లు, సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. వేణు ఉడుగుల అందించిన కథ, కథనం, దర్శకత్వం ఇంప్రెసివ్ గానే ఉన్నా యూనివర్సల్ అప్పీల్ లేకపోవడం ప్రధాన మైనస్ పాయింట్.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5