డైరెక్టర్ శంకర్.. ఒక సినిమా తీశాడంటే ఊహకు కూడా అందని విధంగా ఉంటుంది. ఎవరూ ఊహించని కాన్సెప్టుతో సినిమాలు తీసి ఇండియన్ బాక్సాఫీస్ రేంజ్ ను పెంచిన వ్యక్తిలో ఆయన అగ్రగణ్యుడు. ఇండియన్ సినిమాలో అంత పెద్దగా టెక్నాలజీ లేని సమయంలో రోబో లాంటి సినిమా తీసి ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేశాడు. ఒక రకంగా ఇండియన్ సినిమాకు టెక్నాలజీని పరిచయం చేసింది ఆయనే అని చెప్పుకోవాలేమో. అలాంటి శంకర్ ఇప్పుడు తడబడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఐ సినిమా తర్వాత ఆయన ఇమేజ్ తగ్గుతూ వస్తోంది.
ఇక మొన్న భారతీయుడు-2 ఎంత ఘోరంగా ప్లాప్ అయిందో చూశాం. దాంతో ఆయన తీస్తున్న గేమ్ ఛేంజర్ మీద మొదట్లో చాలా అనుమానాలు వచ్చాయి. ఆ రేంజ్ లో తీస్తాడా లేదా అని. కానీ మొన్న టీజర్ తో వాటన్నింటికీ చెక్ పెట్టేశాడు శంకర్. ఇందులో ఆయన మార్క్ మరోసారి కనిపిస్తోంది. దీన్ని చూసిన ఆయన అభిమానులు వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టీజర్ లో రామ్ చరణ్ ను చూపించిన తీరు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఉన్నాయి మరి. గతంలో శంకర్ యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది.
కాబట్టి ఈ టీజర్ లో వాటిని హైలెట్ చేసి చూపించాడు. ఎలాంటి వీఎఫ్ ఎక్స్ లేకుండా ఓ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీతో వస్తున్నాడు శంకర్. అందుకే ఈ టీజర్ భారీ ఆదరణ దక్కించుకుంటోంది. ఈ టీజర్ తో శంకర్ మీద ఏర్పడ్డ మచ్చ పోయినట్టే అంటున్నారు ఆయన అభిమానులు, మెగా ఫ్యాన్స్.