వినేష్ ఫోగట్.. ఇండియన్ ప్రొఫెషనల్ రెజ్లర్.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అందరి అంచనాలను నిజం చేస్తూ సునాయాసంగా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఈరోజు కొన్ని గంటల్లో రెజ్లింగ్ లో 50 కేజీల విభాగంలో తుది పోరు జరుగుతుందనగా.. ఒక్కసారిగా ఆమెకు ఒలింపిక్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెపై అనర్హత వేటు వేశారు. నిర్ణీత బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా ఒక్కసారిగా ఆమెతో పాటు యావత్ భారతీయుల ” బంగారు” కలపై నీళ్లు చల్లినట్టైంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చకు దారితీసింది. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తీసుకున్న నిర్ణయం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగింది!
వినేష్ మంగళవారం బౌట్ సమయంలో బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. పోటీలో పాల్గొనే ఆటగాళ్లు రెండు రోజులపాటు నిర్ణీత బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. కానీ, ఫైనల్స్ కి ముందు వినేష్ ఒకసారిగా రెండు కేజీల బరువు పెరిగింది. ఆ బరువును తగ్గించుకోవడానికి ఆమె రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఎక్సర్సైజ్ లు చేసింది. అయినప్పటికీ 100 గ్రాముల బరువును అదుపులో ఉంచుకోలేకపోయింది. బరువు తగ్గేందుకు ఆమె శరీరం నుంచి రక్తం తీయడంతో పాటు జుట్టు కూడా కత్తిరించినట్లు సమాచారం. సాధారణంగా మ్యాచ్ కి ముందు బరువు సరిచూసుకోవడానికి అరగంట సమయం ఇస్తారు. వినేష్ కి ఆ సమయం కూడా దాటిపోవడంతో.. మరికొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తోసిపుచ్చారు. అనంతరం ఆమెపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఒలింపిక్స్ లో ఫ్రీ స్టైల్ విభాగంలో మహిళలకు ఆరు విభాగాలు ఉంటాయి. 50, 53, 57, 62,68, 76 విభాగాల్లో పోటీ పడుతుంటారు. వినేష్ 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. క్రీడాకారులు ఆయా కేటగిరిలో పోటీ పడుతున్నారని రుజువు చేసుకునేందుకు ప్రతిరోజు ఉదయం బరువు చెక్ చేస్తారు. అలా చెక్ చేసే సమయంలో వారికి అరగంట పాటు సమయం ఇస్తారు. జెర్సీ తో పాటు బరువు తీస్తారు. మెడికల్ టెస్టులు చేస్తారు. గోర్లు కత్తిరించుకున్నారో లేదో చూస్తారు. క్రీడాకారులు ఆ బరువును రెండు రోజులపాటు మైంటైన్ చేయాల్సి ఉంటుంది. రెండో రోజు మాత్రం వెయిట్ చెక్ చేసుకోవడానికి 15 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు. అలా ఈరోజు వినీష్ కి కూడా అదే సమయం ఇవ్వగా.. ఆ టైం కి ఆమె తన నిర్ణీత బరువును కంట్రోల్ చేసుకోలేకపోయారు.
వినేష్ కు ప్రముఖుల మద్దతు
ఒలింపిక్స్ ఫైనల్స్ ముంగిట అనర్హత వేటు పడిన వినేష్ కి ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా నిలిచారు. ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై మరోసారి ఒలింపిక్స్ కమిటీతో మాట్లాడాలని ఇండియన్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు పీటీ ఉష తో మోడీ ఫోన్లో మాట్లాడారు. వినేష్ కు న్యాయం చేసేందుకు భారత్ కి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. మరోవైపు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం అనేది సమస్య కాదని తోటి రెజ్లర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. బరువు విషయంలో ఒలింపిక్స్ సంఘం మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లైంగిక వేధింపులపై పోరాటం నుంచి ఒలింపిక్స్ వరకు
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు వినేష్ పెద్ద యుద్ధమే చేసింది. లైంగిక వేధింపులపై ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ రోడ్లపై భారత రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వినేష్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. ప్రభుత్వం తనకు అందించిన ” ఖేల్ రత్న” పురస్కారాన్ని ఢిల్లీ రోడ్లపై వదిలేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాసింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో తమకు న్యాయం జరగనప్పుడు అలాంటి పురస్కారాలకు అర్థం లేదని ఆ లేఖలో వినేష్ పేర్కొంది. ఆమెకు మద్దతుగా ఇతర రెజ్లర్లు కూడా తమ పురస్కారాలను, పతకాలను తిరిగిచ్చేశారు.