బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. హై యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాకు టినెటివ్ టైటిల్ ‘SVC63’గా నిర్ణయించారు. ఇప్పుడీ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ వస్తోంది. సినిమాలో సల్మాన్ ను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు.
వీరిలో మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్, హిందీ నుంచి అక్షయ్ ఖన్నా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు సమఉజ్జీల్లా ఉండే విధంగా వీరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని సినిమాలో విలన్ గా తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిపై లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నారని సమాచారం. పుష్ప సిరీస్ సినిమాలతో ఫహాద్ ఫాజిల్, ధురందర్ సిరీస్ సినిమాలతో అక్షయ్ ఖన్నా తమ విలనిజాన్ని అద్భుతంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వీరి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు జోడీగా సినిమాలో నయనతార నటిస్తున్నారు. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి సినిమాలో కీలకపాత్రలో పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొన్నారు. 2027 ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేసేలా చిత్రీకరణ జరుపుతున్నారు.
