2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం.. ఇవన్నీ వైసీపీ కొంపముంచాయి.
అంతేనా.? పార్టీ పరంగా చాలా లోపాలున్నాయ్. పార్టీ కింది స్థాయిలో నాశనమైపోతున్నా, ట్రబుల్ షూటర్ లేకుండా పోవడం వైసీపీ పరాజయానికి ప్రధాన కారణం. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఈ ముగ్గురు రెడ్లూ వైసీపీకి మూల స్తంభాల్లా వుండేవారు ఒకప్పుడు.
రెడ్లకు తప్ప, కీలక వ్యవహారాలు వైసీపీలో ఇంకెవరి చేతుల్లోనూ వుండేవి కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. వీళ్ళే అంతా.! వీరిలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గిరీకీ పరిమితం చేసేసిన సంగతి తెలిసిందే.
ఇక, విజయసాయిరెడ్డి కూడా పార్టీలో ప్రాభవం కోల్పోతూ వచ్చారు. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే జరిగిందన్నది వైసీపీలో కీలక నేతలు ఇప్పుడు వాపోతున్న విషయం. విజయసాయిరెడ్డికీ, సజ్జల రామకృష్ణారెడ్డికీ మధ్య గతంలో జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది.
వైసీపీలో విజయసాయిరెడ్డి వెలుగు కనిపించినన్నాళ్ళూ వైసీపీ బావుండేదనీ, ఎప్పుడైతే సజ్జల ప్రయత్నం పెరిగిందో, అప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమయ్యిందని విజయసాయిరెడ్డి వర్గీయులు అంటున్నారు. దీనికి సజ్జల వైపు నుంచి సరైన కౌంటర్ ఎటాక్ కనిపించడంలేదు. పరిస్థితులన్నీ తనకే వ్యతిరేకంగా వుండడంతో సజ్జల పూర్తిగా సైలెంటయిపోయారు.
పార్టీ నాశనమైపోవడానికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డికి, ఇతర పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయ్.. ఆయన ఏ క్షణమైన పార్టీని వదిలి పోవచ్చంటూ విజయసాయిరెడ్డి వర్గం నుంచి ఆరోపణలు వస్తున్నాయి.