అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ వైపు విజయ సాయి రెడ్డి, మరో వైపు శాంతి, ఇంకో వైపు శాంతి భర్త.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేశారు.. తమ తమ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో నాలుగో వ్యక్తి (శాంతికి ఈయనా భర్తేనట) పేరు కూడా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
వైసీపీ పరువు పోయింది పూర్తిగా ఈ వివాదంతో. ఇంత జరుగుతున్నా, ఒకప్పటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి పెదవి విప్పకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే ఎవరు.? వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు. వైవీ సుబ్బారెడ్డిని పక్కకి తోసేసి, విజయ సాయి రెడ్డిని కూడా తొక్కేసి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీలో సజ్జల చెప్పిందే వేదం. వైసీపీ ప్రభుత్వంలో సజ్జల మాటే చెల్లుబాటు.. ఇలా కథ నడిచింది.
తన తండ్రికి పార్టీలో, ప్రభుత్వంలో దక్కుతున్న గౌరవం నేపథ్యంలో, రంగంలోకి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా దూకేసి, సోషల్ మీడియాలో ఓ వికారపు సైన్యాన్ని పెంచి పోషించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడేమో ఆ సజ్జల భార్గవ్ రెడ్డి మౌనం దాల్చాడు. సజ్జల రామకృష్ణా రెడ్డీ కనిపించడంలేదు. విజయసాయి రెడ్డి ఒక్కరే.. ఒంటరి ‘పోరాటం’ చేస్తున్నారు. అందుకే, మీడియా ముందర మరీ అంతలా విజయసాయి రెడ్డి అసహనం వ్యక్తం చేసేశారు.
పోనీ, అధినేత జగన్ నుంచి విజయ సాయి రెడ్డికి ఏమైనా సాంత్వన చేకూరుతుందా.? అంటే, జగన్ కూడా విజయ సాయి రెడ్డికి అందనంత దూరం బెంగళూరుకి వెళ్ళిపోయారాయె. ‘ఇక వేరే దారి లేదు.. నా దారి నేను చూసుకోవడమే’ అన్న అభిప్రాయానికి విజయ సాయి రెడ్డి వచ్చేస్తే.?
అదే, బీజేపీలోకి దూకెయ్యాలని విజయసాయి రెడ్డి భావిస్తే.? ఆయన వెంట ప్రచారంలో వున్నట్లుగా ఓ అరడజను మంది రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి తీసుకెళ్ళిపోతే.? దీనంతటికీ సజ్జల బాధ్యత వహిస్తారా.? అసలు ఈ గలాటా మొత్తానికీ సజ్జల కారణమన్న విమర్శల సంగతేంటి.?
సదరు అధికారిణి శాంతి ఫొటోలు ఈ రోజు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫొటోల లీక్ వెనుక కూడా సజ్జల హస్తం వుందన్న ఆరోపణల్లో నిజమెంత.?
‘నేను రిస్క్ చేసి ఎన్నికల్లో పోటీ చేశాను. సజ్జల రామకృష్ణా రెడ్డి అదీ చేయలేదు. పార్టీని భ్రష్టు పట్టించింది సజ్జల రామకృష్ణారెడ్డే..’ అంటూ విజయ సాయి రెడ్డి తనకు అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల దగ్గర వాపోతున్నారన్నది నిజమేనా.?