హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలల మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.
అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న, ఆయన తల్లి మాధవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి రమేష్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ, మార్కుల కంటే వాటిని సాధించేందుకు విద్యార్థులు చూపిన క్రమశిక్షణ, ఏకాగ్రత, కృషి మరింత విలువైనవని అన్నారు. తాను, రష్మిక కూడా విద్యార్థి దశలో ర్యాంకర్లు కాదని, కానీ కష్టపడి ముందుకు రావచ్చని చెప్పారు. అచ్చంపేటలో ప్రారంభమైన ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో నాగర్‌కర్నూల్ జిల్లా మొత్తానికి, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని తమ లక్ష్యమని వెల్లడించారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ, పేద కానీ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎంత ఎదిగినా సొంత ఊరిని మరచిపోకుండా విద్యార్థుల కోసం ముందుకు రావడం విజయ్ దేవరకొండ గొప్పతనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల వంటి విలువలు జీవితంలో విజయానికి పునాది అని అన్నారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. విద్య ద్వారా జీవితాలను మార్చే లక్ష్యంతో ది దేవరకొండ ఫౌండేషన్ చేపట్టిన ఈ ప్రయత్నం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
