రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌత్ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ వేడుకగా అట్టహాసంగా జరిగాయి. ఇక టాలీవుడ్ నుంచి బేబీ, దసరా, హాయ్ నాన్న మూవీలు అవార్డులు అందుకున్నాయి. ఇందులో ముఖ్యంగా దసరా మూవీకి గాను నేచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడిగా సెలెక్ట్ అయ్యారు. ఆయనకు విజయ్ దేవరకొండ అవార్డును అందజేశారు. అయితే విజయ్ ఈ అవార్డు అందజేయడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది.
ఎందుకంటే వీరిద్దరి నడుమ కోల్డ్ వార్ ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. వాటికి తాజాగా వీరిద్దరూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నానిని ఉద్దేశించి అదే స్టేజి మీద విజయ్ కీలక కామెంట్స్ చేశారు. నానితో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తొలిసారి తాను కీలక పాత్ర చేశానని.. ముందు నానితోనే ఆడిషన్ అని చెప్పడంతో చాలా సంతోషించినట్టు తెలిపాడు విజయ్. నాని నుంచి నటన పరంగా చాలా విషయాలు నేర్చుకున్నట్టు వివరించాడు రౌడీ స్టార్. నాని తనకు ఎన్నో విషయాల్లో అండగా ఉన్నాడని తెలిపాడు. నాని నువ్వు వరుస విజయాలు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ అవార్డు నీకు నేను ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేనంటూ తెలిపాడు విజయ్. దానికి నాని కూడా స్పందించాడు. విజయ్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని.. తామిద్దరం ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్లం అని తెలిపాడు నాని. సినిమా గురించి చాలా డౌట్లు అడుగుతుండేవాడని.. ఏదో కొత్తది నేర్చుకోవాలనే తపన ఉన్న నటుడు విజయ్ అని ప్రశంసించాడు నాని. గౌతమ్ తిన్నమూరి సినిమాకు ఈ అవార్డు విజయ్ కు తాను ఇస్తానంటూ చెప్పాడు నాని. దీంతో వీరిద్దరు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.