మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ ఆల్రెడీ ఆమె మీడియా ముందుకొచ్చారు. సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా చేశారామె.
సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. కేసులు లేకపోతే, రాజకీయ నాయకులే కారన్న భావన జనంలోనూ పెరిగిపోయింది. వైసీపీలో అయితే, నాలుగైదు క్రిమినల్ కేసులు మినిమమ్ క్వాలిఫికేషన్.. అన్న చర్చ జనాల్లో జరుగుతోందనుకోండి.. అది వేరే చర్చ.
ఇక, తన మీద నమోదైన కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ విడదల రజనీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ ఎంపీగా వున్న శ్రీకృష్ణదేవరాయలు, తన మీద కక్షపూరితంగా తన వ్యక్తిగత కాల్ డేటాను సేకరించారంటూ సంచలన ఆరోపణలు చేశారామె. ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను ఫిర్యాదు చేస్తే, కృష్ణ దేవరాయలను పిలిచి, మందలించారంటూ విడదల రజనీ చెప్పుకొచ్చారు.
ఆ కక్షతోనే, ఇప్పుడు తన మీద లేనిపోని కేసులు పెట్టేలా తెరవెనుకాల కృష్ణదేవరాయులు కుట్ర పన్నుతున్నారన్నది విడదల రజనీ ఆరోపణ. ఇది నిజమా? కృష్ణదేవరాయలు ఎలాంటి వ్యక్తి.? ఇదంతా మళ్ళీ వేరే చర్చ.
ముఖ్యమంత్రిగా వున్న జగన్ మోహన్ రెడ్డి దగ్గరకి, ‘కాల్ డేటా’ వ్యవహారాన్ని ఓ మహిళా ఎమ్మెల్యే, పైగా మంత్రి కూడా అయిన విడదల రజనీ తీసుకెళితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో వుండి, కేవలం ‘మందలించి’ వదిలేయడమేంటి.?
నిజానికి, ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఇంకొకరి కాల్ డేటాని సేకరించడం.. అనేది ‘నేరం’గానే పరిగణించబడుతుంది. సాదా సీదా వ్యవహారం కాదిది, తీవ్రమైన నేరమే. ఎంపీగా వున్నంతమాత్రాన, శ్రీకృష్ణదేవరాయలు చేసింది నేరం కాకుండా పోదు. నేరం జరిగిందని ముఖ్యమంత్రికే ఓ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే, ముఖ్యమంత్రి చట్ట పరమైన చర్యలకు ఆదేశించాలి కదా.?
ముఖ్యమంత్రి మందలించి వదిలేశారంటే, ముఖ్యమంత్రి కూడా ఆ నేరాన్ని సమర్థించినట్లే.! ఈ లెక్కన కాల్ డేటా వ్యవహారం నిజమే అయితే, ఈ కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితుడే అవుతారన్నమాట.
భలే ఇరికించేశారు విడదల రజనీ, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.