సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కాలిన గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రులను చూసి చలించిపోయిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని అడిగి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
ఈ ప్రమాదానికి భద్రతా నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణమని పవన్ కళ్యాణ్ మీడియాతో వెల్లడించారు. అనుమతి ప్రకారం 8 మంది మాత్రమే పని చేయాల్సిన యూనిట్‌లో 31 మందిని పని చేయించారని తెలిపారు. జాతరలు, పండుగల నేపథ్యంలో అధిక ఉత్పత్తి కోసం పరిమితికి మించి కూలీలను నియమించడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ కళ్యాణ్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్ తదితరులు కూడా ఘటనపై వివరాలు అందించారు.
వేట్లపాలెం బాణసంచా పేలుడు ప్రమాదం భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తుందో మరోసారి స్పష్టం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
