Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా వార్తల్లో నిలిచింది. అయితే.. తనకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని వేణు స్పష్టతనిచ్చారు. ఈక్రమంలో మీడియాలో వచ్చిన కథనాలు తననెంతో బాధించాయని అన్నారు. ఎటువంటి నిర్ధారణ లేకుండా వచ్చే ఇటువంటి పుకార్లతో ఒక కుటుంబం బాధపడుతుందని.. వాస్తవాలు తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
‘మంగ్లీ కేసులో నన్ను కలుపుతూ మీడియాలో వచ్చిన వార్తలు నన్నెంతో బాధించాయి. ఆ ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు. మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు ఇద్దరూ నాకు పరిచయస్థులే. దీంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రమే సూచించా. అంతకుమించి ఈ వ్యవహారంలో నా పాత్ర ఎంతమాత్రమూ లేదు. అయినా.. నా పేరు ఈ కేసులో ఇరికిస్తూ వార్తలు వైరల్ అయ్యాయి. పోలిస్ ఎఫ్ఐఆర్ లో కూడా నాపేరు నిందితుడిగా ఎక్కడా లేదు. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారు. కేసు పెట్టిన సుబ్బారావు.. నాకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పారు. ఇటువంటి నిరాధార వార్తల వల్ల ఒక వ్యక్తిగత పరువు, కుటుంబ గౌరవం ప్రభావితమవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విన్నవించుకుంటున్నా’నని తెలిపారు.

