విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై వెంకట్, బాబా నిర్మాతలుగా, అజయ్.యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, బిగ్‌బాస్ ఫేమ్ బెజవాడ బేబక్క, దర్శకనిర్మాత సాయివెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. నటుడు సతీష్ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపిస్తున్నానని, ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెస్తుందని అన్నారు. దర్శకుడు అజయ్ సినిమాపై పూర్తి అంకితభావంతో పనిచేశారని, నిర్మాతలు వెంకట్, బాబా ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించారని చెప్పారు. బేబక్క మాట్లాడుతూ హీరో విక్రమ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుందని, ఆనంద్ రాజా అందించిన పాటలు చాలా బాగున్నాయని, హీరోయిన్ రమ్య తెరపై ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ రాజా మాట్లాడుతూ, ఈ చిత్రంతో తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతంతో పాటు లిరిక్స్ కూడా తానే అందించినట్లు చెప్పారు. ‘వన్ టు త్రీ’ అనే పాట ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చుతుందని తెలిపారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ, హీరోగా తనను తాను స్క్రీన్‌పై చూసుకుంటే భావోద్వేగానికి లోనయ్యానని, అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. మంచి పేరు తెచ్చుకుని తన తండ్రిని గర్వపడేలా చేస్తానని అన్నారు.
హీరోయిన్ రమ్య మాట్లాడుతూ, ‘వెంకీ పింకీ జంప్’ తన తొలి చిత్రం అని, ఇందులో పింకీ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. అతిథిగా హాజరైన నిర్మాత లయన్ సాయివెంకట్ సినిమా పాటలను ప్రశంసిస్తూ, విడుదల సమయంలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
దర్శకుడు అజయ్.యన్ మాట్లాడుతూ, ‘వెంకీ పింకీ జంప్’ ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అని, టైటిల్‌నే కథకు సంకేతమని అన్నారు. ప్రేమలో ఉన్న వెంకీ, పింకీ తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఊరి నుంచి పారిపోతారని, ఆ తర్వాత వారి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నదే కథ అని వివరించారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. ‘వెంకీ పింకీ జంప్’లో హీరో విక్రమ్, హీరోయిన్ రమ్య మంచి నటన కనబరిచారని, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
యూత్, ప్రేమ, వినోదం, కమర్షియల్ అంశాలతో రూపొందిన ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో రిలీజ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
