Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. 1960-70లనాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీ టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా నవంబర్ 14న విడుదలవుతున్న సందర్భంగా విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది టీమ్.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ… బర్మా నుంచి విశాఖకు శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథ ఇది. ఇప్పటివరకూ చేసిన ప్రయోగాత్మక సినిమాలకు భిన్నంగా మాస్ సినిమా చేద్దామని భావిస్తూండగా కరుణ కుమార్ మట్కా కథతో వచ్చారు. మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్. నాలోని నటుడినిని పట్టుకున్నారు. ఆయనతో వర్క్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సినిమా చూసి అందరూ కరుణ కుమార్ గురించి మాట్లాడుకుంటారు. నన్నెప్పుడూ ఎమోషనల్ సపోర్ట్ చేసే చరణ్ అన్నకు థ్యాంక్స్. బాబాయ్. పెదనాన్న ఎప్పుడూ గుండెల్లో ఉంటారు. నవంబర్ 14న ‘మట్కా’ రిలీజ్ అవుతుంది. ఈసారి టార్గెట్ మిస్ కాదు.. గట్టిగా కొడతాను. సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ని అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్.. నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. చిన్న మత్స్యకార గ్రామంగా మొదలైన వైజాగ్ నేడు ప్రపంచంలో పవర్ హౌస్ గా నిలిచింది. ఇంత అభివృద్ధి చెందిన వెనక చాలామంది ఉన్నారు. విశాఖ చరిత్ర, ఇక్కడ పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. చరిత్రను మళ్ళీ క్రియేట్ చేద్దామని విశాఖలో సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ‘మట్కా’ రాసుకున్నా. ఇది ఫిక్షనల్ స్టోరీ. గతంలో ఇక్కడ నైట్ క్లబ్లు, క్యాబ్రీలు ఉండేవి. కథ చెప్పిన ఫస్ట్ మీటింగులోనే వరుణ్ ఓకే చేశారు. సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ చూసి చెప్తున్నాను.. సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా సక్సెస్ చేయాలని కోరుతున్నా’నని అన్నారు.
నిర్మాత రామ్ తాళ్ళూరి.. వరుణ్ తేజ్ కూల్ పర్సన్. పవన్ కళ్యాణ్-వరుణ్ కి 100% మ్యాచింగ్ ఉంది. మట్కా తర్వాత వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకరవుతారు. సినిమాలో వరుణ్ తేజ్ గారి పెర్ఫామెన్స్, మార్కెట్లో ఫైట్ అద్భుతంగా వచ్చాయి. సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. విశాఖను రీ-క్రియేట్ చేశారు. కరుణాకరణ్ ఎంతో రీసెర్చ్ చేసి కథ రాసుకున్నారు. మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’నని అన్నారు.