కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునే విషయంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా బారిన పడిన వారు కోలుకున్న మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియపరచాలని లేఖలో స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ కు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇచ్చిన సూచనల మేరకే ఈ మార్గదర్శకాలు వెల్లడిస్తున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం దేశంలో రోజుకి 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో కేంద్రం ఈ సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో సాధారణ వ్యాక్సిన్ తోపాటు 15-18 ఏళ్ల వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60ఏళ్లు దాటిన వారికి ప్రికాషన్ డోసులు వేస్తున్న సంగతి తెలిసిందే.