జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మానికి’ బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయారు. దేశవ్యాప్తంగా హిందువులంతా ఇప్పుడాయన్ని, సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్‌గానే చూస్తున్నారు మరి.!
నిన్న అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన మెట్ల మార్గంలో చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమార్తెలు ఆద్య, అంజని కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు.
పోలెనా అంజని, తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆమె తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్‌పై సంతకాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్‌నెవా దంపతుల కుమార్తె పోలెనా అంజని, క్రిస్టియన్ మత ఆచారాల్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ నిబంధనలను గౌరవించి, కుమార్తెతో డిక్లరేషన్ మీద సంతకం చేయించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
మరోపక్క, రేపు తిరుపతిలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, తన వెంట తిరుమలకు ఇప్పటికే ‘వారాహి డిక్లరేషన్’ని తీసుకెళ్ళారు. అందులో ఏముంది.? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వారాహి బహిరంగ సభలో, వారాహి డిక్లరేషన్‌ని పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారట. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు.. డిమాండ్ ఈ డిక్లరేషన్‌లో ప్రధాన అంశం కావొచ్చన్న చర్చ అంతటా జరుగుతోంది. అలాగే, దేవాలయాలను రాజకీయాలకు దూరంగా వుంచడం, దేవాలయాలపై రాజకీయ పెత్తనం లేకుండా చేయడం.. వంటి అంశాలూ ఈ డిక్లరేషన్‌లో వుండొచ్చు.
తిరుపతిలో నిర్వహించబోయే బహిరంగ సభకు లక్షలాది జనం తరలి వస్తారన్నది నిర్వివాదాంశం. అయితే, జనసేన పార్టీ ఇప్పటిదాకా నిర్వహించిన బహిరంగ సభలన్నిటికీ మించి ఈ ‘వారాహి డిక్లరేషన్’ సభకు జనం తరలివచ్చే అవకాశం వుంది.
వారాహి డిక్లరేషన్ సభలో, జనసేన జెండాలు తక్కువ వుండేలా.. కేవలం దీన్నొక సనాతన ధర్మ పరిరక్షణ సభ తరహాలో నిర్వహించాలనే ఆలోచనలో జనసేన వున్నట్లు తెలుస్తోంది.