రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన దర్జీ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం దేశంలో పెను ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ నేత నుపూర్ శర్మ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధించడమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయ్ పూర్ లో నెల రోజులు ప్రజలు గుమికూడదనే ఆంక్షలతోపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు.
అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా.. ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని కూడా చంపేస్తామని హెచ్చరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘాతుకాన్ని పాక్ ఉగ్రవాద ముఠాకు చెందిన స్లీపర్ సెల్స్ చేసుంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని తెలుస్తోంది.
ప్రస్తుతం కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయగా.. మరో 10మందిని విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు హోంశాఖ అప్పగించింది. ఘటన వెనుక అంతర్జాతీయ ముఠా పని ఉందా అనే కోణంలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది.