Dimple Hayathi: నటి డింపుల్ హయతి (Dimple Hayathi) ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. గురువారం ఉదయం జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ ఎస్కేఆర్ ఎన్ క్లేవ్ లో డింపుల్ ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్ తో కలిసి ఉంటున్నారు. ఇటివలే అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదం కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గురువారం ఉదయం సీ2లో ఉంటున్న డింపుల్ ఫ్లాట్ లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించారు. పనిమనిషి ఆరా తీయడం, కుక్క అరవడంతో వారు లిఫ్టులోకి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న డింపుల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విచారణలో వారు డింపుల్ అభిమానులమని చెప్పారు. రాజమండ్రి నుంచి వచ్చామని.. వారి పేర్లు కొప్పిశెట్టి సాయిబాబు, శృతిగా చెప్పారు. విషయం డింపుల్ కు తెలియజేయగా విడిచిపెట్టమని చెప్పారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.