చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా చేస్తానని.. ఇక నుంచి నెలకోసారి తెలంగాణకు వస్తానంటూ ఆయన ప్రకటించారు. అప్పటి నుంచే ఆయన మార్క్ రాజకీయం మొదలెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కారు పార్టీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు జీహెచ్ ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా వీరిని చంద్రబాబు టీడీపీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత తీగల కృష్నారెడ్డి మాట్లాడుతూ తాను త్వరలోనే టీడీపీ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ కు కారణం చంద్రబాబే అని తెలిపారు. ఇక మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారే విషయంలో కలవలేదని.. తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కలిసినట్టు వివరించారు. అయితే మల్లారెడ్డి పైకి ఇలా చెబుతున్నా.. ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా మల్లారెడ్డి తన అనుచరులతో, సన్నిహితులతో మీటింగ్ పెట్టారు. ఇందులో పార్టీ మారే విషయంపైనే చర్చించారంట. అందుకే ఆయన మీద ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీకి ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. వీరిని చూసి మరింత మంది టీడీపీకిలోకి వెళ్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.