తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి, విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ ఈ రచ్చ జరుగుతూనే వుంది.
నిజానికి తమిళనాడు రాజకీయాలు వేరు, తెలుగునాట రాజకీయాలు వేరు. తెలుగునాట.. అంటే, రెండు తెలుగు రాష్ట్రాలు. కొత్తగా ఎవరు ఎక్కడ రాజకీయ పార్టీ పెట్టినా, తెలంగాణ – ఆంధ్ర అనే ప్రస్తావన తప్పనిసరి. ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అయితే, తెలంగాణ అంశంతోపాటు, సీమాంధ్ర అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది.
తెలంగాణని విడదీసి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్ని చూడలేం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ తెలంగాణ అంశం ఎంతో కొంత కలిసే వుంటుంది. ఇంతటి ప్రత్యేకమైన పరిస్థితి వుంటుంది తెలుగునాట రాజకీయాల్లో. తమిళనాడులో ఈ పరిస్థితి లేదు.
విభజన గాయం రెండు తెలుగు రాష్ట్రాలకీ వుంది. ఇంకా అది పచ్చి పుండులానే వుందన్నది నిర్వివాదాంశం. ఆ గాయాన్ని కొందరు రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఇంకాస్త పచ్చిగా మార్చేస్తుంటారు కూడా. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి ఎదుర్కొన్న తెలంగాణ సెగ.. అంతా ఇంతా కాదు.
పవన్ కళ్యాణ్ కూడా జన సేన పార్టీ విషయమై తెలంగాణ సెగని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటూనే వున్నారు. ఇంతటి ప్రత్యేకమైన పరిస్థితులున్న తెలుగు నేలని, తమిళనాడు రాజకీయాలతో పోల్చడం హాస్యాస్పదం. విజయ్ పొలిటికల్ ఎంట్రీ వ్యవహారం వేరు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తమ తమ స్థాయిలో రాణించారు, పవన్ కళ్యాణ్ రాణిస్తున్నారు. తమిళనాడులో విజయ్ కాంత్, ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. సీఎం అవ్వాలన్న కోరికని ఆయన నెరవేర్చుకోకుండానే కాలం చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కొండంత రాగం తీసి తుస్సుమనిపించారు.. ఆయనసలు రాజకీయాల్లోకే రాలేదు. వస్తానంటూ అభిమానుల్ని ఊరించి, ఉస్సూరుమనిపించారు రజనీకాంత్.
కమల్ హాసన్ సంగతి సరే సరి. రాజకీయ పార్టీ పెట్టారుగానీ, అది వుందో లేదో ఆయనకే తెలియదు. అలాంటి తమిళనాడులో విజయ్, రాజకీయంగా నిలబడ్డారు.. సత్తా చాటారు. అభినందించాల్సిందే. అంతమాత్రాన, విజయ్‌కి ఏపీ రాజకీయాలతో పోలిక పెట్టకూడదు.
భవిష్యత్తులోనూ తమిళ రాజకీయాల ప్రభావం, తెలుగు రాష్ట్రాలపై అస్సలు వుండదు. ఎందుకంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. రాజకీయం చాలా ప్రత్యేకం. మిగతా రాష్ట్రాలన్నిటితో పోల్చితే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇంకా ఇంకా ప్రత్యేకం.
