తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా నిర్వహించని సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై అన్నమయ్య భవనంలో అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వివరాలు వెల్లడిస్తూ..
‘రెండేళ్లుగా కొవిడ్ కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాం. ఈ ఏడాది యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 1న గరుడ సేవ, 2న బంగారు రథం, అక్టోబర్ 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి’.
‘సెప్టెంబర్ 27న బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణకు సీఎం జగన్‌కు ఆహ్వానపత్రిక ఇస్తాం. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నాం. వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు కూడా రద్దు చేస్తున్నాం’ అని ఈఓ ధర్మారెడ్డి వివరించారు.