హుజూర్ నగర్ ఉప ఎన్నికలను తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హస్తం కోటలో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్.. అన్ని విషయాల్లోనూ తగిన సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడా కూడగడుతుండటం విశేషం.
ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన పార్టీల అండ కోరుతున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలను కలిసి వారి మద్దతు సంపాదించిన టీఆర్ఎస్.. తాజాగా వైఎస్సార్ సీపీని మద్దతు ఇవ్వాలని కోరింది. ఇందుకు ఆ పార్టీ సైతం అంగీకారం తెలిపింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తాము అధికార పార్టీకి మద్దతిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవల కేసీఆర్ సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించి మద్దతు అడిగారు.
ఇప్పటికే పలు అంశాల్లో ఇరువురు సీఎంలు కలిసి సాగుతున్న తరుణంలో జగన్ ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గట్టు వద్దకు పల్లా రాజేశ్వరరెడ్డి వెళ్లి తమకు అనుకూలంగా ప్రకటన చేయించుకున్నారు. ఒకప్పుడు సీపీఐని, వైఎస్సార్ సీపీని టీఆర్ఎస్ నేతలు విపరీతంగా విమర్శించారు. వైఎస్సార్ సీపీ అయితే ఆంధ్రా పార్టీ అంటూ పలుమార్లు ధ్వజమెత్తారు. కానీ అనంతరం కాలంలో మారిన పరిణామాల నేపథ్యంలో జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యాయి. ఎన్నికల్లో ఒకరికొకరు సాయం చేసుకున్నారు.
తాజాగా హుజూర్ నగర్ బరిలో వైఎస్సార్ సీపీ మద్దతు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఓ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనే అభిప్రాయం ప్రబలుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోటలో జెండా ఎగురేసి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఫలితంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. అందుకే అప్పడు విమర్శించిన పార్టీలను ఇప్పుడు మచ్చిక చేసుకుంటోంది. రాజకీయాలంటే అంతే మరి.
