YS Jagan: చంద్రన్న కానుక.. ఎవడబ్బ సొమ్ము.? అన్నారు అప్పట్లో వైసీపీ నేతలు. మరిప్పుడు, జగనన్న గోరు ముద్ద.. ఎవడబ్బ సొమ్ము.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది కదా.! పైగా, ఇప్పుడు ‘మేనమామ’ అట.!
‘మేనమామగా..’ అంటూ పెద్దయెత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏడాదికి 86 కోట్లు కేవలం ‘రాగి జావ’ పథకానికే ఖర్చు చేస్తున్నారట. ఇంకా నయ్యం.. జగనన్న రాగి జావ పథకం.. అని పేరు పెట్టలేదు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో ఇది కూడా ఓ భాగం అంతే.! సరిపోయింది సంబరం.!
‘పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.. చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మద్యాహ్న భోజన కార్యక్రమం గోరుముద్దలో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగి జావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కి సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకి ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకి నా ధన్యవాదాలు’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రాగి జావ వ్యవహారానికి సంబంధించి.
ఎవరు అధికారంలో వున్నా ఖర్చు చేసేవి సొంత సొమ్ములు కావు.! సో, ప్రభుత్వం పరంగా ఎంత ఖర్చు చేసి, జనాన్ని ఉద్ధరించినా అభినందించి తీరాల్సిందే. అయితే, ఇక్కడ సొంత పేర్లు ఎందుకు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా, ఈ సొంత పబ్లిసిటీ కోసం ఏటా కోట్లు ఖర్చవుతున్నాయి. ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
పత్రికల్లో ప్రకటనలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు.. ఇదంతా ఓ పెద్ద తతంగం. బహిరంగ సభలూ గట్రా.. అది మళ్ళీ వేరే చర్చ. మేనమామ అంటే, జేబులోంచి తీసి ఖర్చు చేయాలి. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తూ ‘మేనమామ’ అంటారేంటి.? అని జనమే నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ వేదికగా ప్రశ్నిస్తున్నారాయె.!