వెటకారం ముదిరితే ట్రోలింగ్.! సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ వెర్రి తలలు వేస్తున్నమాట వాస్తవం.! కానీ, వేదికల మీద మాట్లాడేటప్పుడు, ట్రోల్స్ గురించి అయినా మాట మీద అదుపు కోల్పోతే ఎలా.? అదీ, మీడియాని ఉద్దేశించి సెటైర్లు వేయడం.!
సినీ నటుడు సిద్దార్థ తన తాజా సినిమా ప్రమోషన్ కోసం తెలుగు మీడియా ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ట్రోలర్స్‌ని ‘యెదవలు’గా అభివర్ణించాడు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి క్లారిటీ కోసం ప్రయత్నిస్తే, సిద్దార్ధ ఇంకాస్త చెలరేగిపోయాడు.
‘ఇక్కడెవరూ యెదవలు లేరు కదా.! లేరు, ఎవరి దగ్గరా ఐడీ కార్డులు లేవు. ఇక్కడ లేని యెదవల గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఆ యెదవల్ని మీరు వెనకేసుకొస్తూ ప్రశ్నలు వేయొద్దు..’ అని సిద్దూ అతి తెలివి ప్రదర్శించాడు.
మీడియా ముందుకొస్తే, ఫలానా సెటైర్ వేయాలని ముందే ఫిక్సయవుతాడు సిద్దూ. అదే అమలు చేస్తాడు కూడా. సిద్దార్ధ సినిమా ‘మిస్ యూ’, ఈ నెలాఖరున విడుదలవుతోంది. ‘పుష్ప-2’ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. రెండు సినిమాలకీ మధ్య కేవలం ఒక్కవారం గ్యాప్ మాత్రమే వుంది.
ఈ రోజుల్లో ఏ సినిమా అయినా, రెండో వారం పోస్టర్ పడటమే కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న వచ్చింది. రెండో వారానికి మీ సినిమాని థియేటర్లలోంచి లేపేస్తారు కదా.. అని.! దాంతో, ‘మంచి సినిమాని తీసెయ్యడం సాధ్యం కాదు. ఇరవయ్యేళ్ళ క్రితం పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ తేడా వుంది..’ అని సిద్దూ చెప్పుకొచ్చాడు.
‘నా సినిమా బావుంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారు. తర్వాత వచ్చే సినిమా భయపడాలి..’ అంటూ ‘పుష్ప-2’ గురించి తేలిక వ్యాఖ్యలు చేశాడు సిద్దూ. ఈ వ్యవహారమిప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.