సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై పెండింగ్ బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ అధికారులు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటివల రవాణా మంత్రి సమావేశంలో అధికారులు ఈ విషయమై విన్నవించారు. ఒంగోలు తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పాత బకాయిలు తీర్చాలని కోరారు. వీఐపీల కాన్వాయ్‌లకు ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమని అధికారులు లేఖలో వివరించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని.. ప్రత్యేక ఖాతా ద్వారా బిల్లులు చెల్లించాలని కోరారు.
ఇప్పటివరకూ పేరుకుపోయిన మూడేళ్ల బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని లేఖ రాశారు. కాన్వాయ్ వాహనాల ఏర్పాటుకు తక్షణం బిల్లులు చెల్లించాలని కోరారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే సీఎం, ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని లేఖలో స్పష్టం చేశారు. ఇటివల ఒంగోలులో తిరుమల వెళ్తున్న ఓ కుటుంబానికి చెందిన కారును సీఎం పర్యటన పేరుతో అధికారులు తీసుకెళ్లడం విమర్శలపాలైన సంగతి తెలిసిందే.