ఏపీలో మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన లాటరీ పద్ధతి ప్రశాంతంగా జరిగింది. రెండు, మూడు చోట్ల మినహా మిగతా అంతటా ప్రశాంతంగానే జరిగింది. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోఏ లాటరీ పద్ధతిలో టెండర్ దారులకు దుకాణాలను కేటాయించారు. ఈ సారి ఏకంగా 3,396 మద్యం దుకాణాలకు టెంటర్లు వచ్చాయి. అయితే ఇందులో ఏకంగా 345 దుకాణాలను మహిళలే దక్కించుకున్నారు. అంటే 10.20 శాతం దుకాణాలను మహిళలే దక్కించుకున్నారు.
ఇక ఎక్కువగా అధికార పార్టీలకు సంబంధించిన వారికి, వారి అనుచరులకే టెండర్లు దక్కినట్టు తెలుస్తోంది. ఇక ఏపీలోని మద్యం దుకాణాలను తెలంగాణకు చెందిన చాలా మంది దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ కు చెందిన కొందరు కూడా ఈ మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. కేవలం తెలంగాణ వారే కాదు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా టెండర్లు వేయగా.. అందులో కొందరికి అదృష్టం వరించింది. ఓ వ్యక్తి 180 దరఖాస్తులు వేయగా.. అందులో 11 దుకాణాలు దక్కాయి.
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ద్వారా మళ్లీ ఇంత పెద్ద ఎత్తున మద్యం దుకాణాలకు టెండర్లు వచ్చాయి. ఈ మద్యం దుకాణాలతో కల్తీలేని, తక్కువ ధరకే మద్యం అమ్ముతామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తెలిపింది. కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగబోతున్నట్టు తెలుస్తోంది.