హైదరాబాద్ నగరం ప్రస్తుతం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారిపోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో దేశం నలుమూలల నుంచీ బీజేపీ శ్రేణులు నగరానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ‘ముందైనా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు చేరుకోండి’ అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులను కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.
- ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్ తోపాటు పరేడ్ గ్రౌండ్స్ నుంచి మూడు కిలోమీటర్ల వరకూ ఆంక్షలు కొనసాగుతాయి. నేడు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ ఉంటాయి.
- హెచ్ఐసీసీ మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట ఎయిర్ పోర్ట్, పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి.
- టివోలీ క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా రోడ్ మధ్య రహదారి మూసివేస్తారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా చిలకలగూడ ప్లాట్ ఫాం 10 వైపు నుంచి వెళ్లాలి.
- ఉప్పల్ నుంచి వచ్చే వారు నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిలకలగూడ నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 10 ద్వారా వెళ్లాలి.
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే ప్రయాణికులు ప్యారడైజ్, బేగంపేట వైపు వెళ్లొద్దు
- కరీంనగర్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రావాలి
- ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా పంజాగుట్ట, అమీర్ పేట వెళ్లేవారు ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్ మీదుగా వెళ్లాలి.
- మేడ్చల్, బాలానగర్, కార్ఖానా, తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ వచ్చేవారు నేరేడ్ మెట్, మల్కాజిగిరి నుంచి వెళ్లాలి.