దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ చారిత్రాత్మకమని అభివర్ణించారు. జీఎస్టీ స్లాబుల సరళీకరణ వల్ల పర్యాటక రంగం, సినిమా రంగం మరింత బలపడతాయని తెలిపారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, హోటల్ రూమ్ టారిఫ్‌లు రూ.7,500 లోపు ఉన్న వాటిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారని, రెస్టారెంట్ బిల్లులపై పన్ను కూడా 12–18% నుండి 5%కు తగ్గించినట్టు చెప్పారు. దీని వల్ల బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజం మరింత ప్రోత్సాహం పొందుతాయని అన్నారు.
సినిమా రంగంలో కూడా పెద్ద ఊరట లభించిందని మంత్రి తెలిపారు. సినిమా టికెట్ ధర రూ.100 లోపు ఉంటే 12% జీఎస్టీ, రూ.100 పైగా ఉంటే 18% జీఎస్టీ కొనసాగుతుందని వివరించారు. అలాగే సినిమా ప్రొడక్షన్ సేవలను 18% శ్లాబ్ పరిధిలోకి తెచ్చి నిర్మాతలకు ఆర్థిక లాభం కల్పించారని అన్నారు.
ఈ నిర్ణయాలు సినిమా, పర్యాటక రంగాల్లో ఉపాధి పెంచి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
