ఏడేళ్ళ కుమారుడు, అపస్మారక స్థితిలో వున్నాడంటే, ఏ తండ్రికైనా అది గుండె పగిలేంత కష్టం. పైగా, చాలా దూరంలో ఆసుపత్రిలో కుమారుడు చికిత్స పొందుతున్నాడంటే, అది తట్టుకోలేనంత కష్టం.
మామూలుగా అయితే, వున్నపళంగా.. కొడుకుని చూసేందుకు వెళ్ళిపోతాడు ఏ తండ్రి అయినా. ఆయన కేవలం ఏడేళ్ళ తనయుడికి తండ్రి మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా.
సింగపూర్‌లో, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సమ్మర్ క్యాంప్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా వున్నాడు. హుటాహుటిన క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అధికారులు, వెంటనే పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసేందుకు చర్యలు చేపడుతుండగా, వారిని పవన్ కళ్యాణ్ వారించారు. గిరిజన గ్రామాలకు చెందిన అభివృద్ధి పనులు కావడంతో, పవన్ కళ్యాణ్.. ఆ పనులు పూర్తి చేయాలనే అనుకున్నారు.
కొందరు మీడియా ప్రతినిథులు కూడా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారిక పర్యటనలు సబబు కాదని కూడా, సీనియర్ జర్నలిస్టులు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ద్వారా పవన్ కళ్యాణ్‌కి సూచించారు.
మరోపక్క, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, పలువురు శ్రేయోభిలాషులు, పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకుని, వెంటనే సింగపూర్ వెళ్ళాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌కి చెప్పారట.
అయినాగానీ, పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారిక కార్యక్రమాల్ని దాదాపుగా పూర్తి చేసుకున్నాకే, కుమారుడిని చూసేందుకోసం విమానమెక్కారు. హైద్రాబాద్ చేరుకుని, మీడియాకి సమాచారమిచ్చి, పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి బయల్దేరారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు. జనంలో వున్నంత సేపూ హుషారుగానే పైకి కనిపించినా, లోలోపల తనయుడి ఆరోగ్య పరిస్థితి గురించి బాధపడుతూనే వున్నారు పవన్ కళ్యాణ్. ‘ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు’ అని పవన్ కళ్యాణ్‌ని దగ్గరుండి చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇలాంటి నిబద్ధత గల పొలిటీషియిన్‌ని, తన కెరీర్‌లో ఇంతవరకూ చూడలేదని ఓ సీనియర్ జర్నలిస్టు, తోటి జర్నలిస్టుల వద్ద కామెంట్ చేశారు.
ఓ వైపు, జెఇఇ మెయిన్స్ విద్యార్థుల రగడ, ఇంకో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోపక్క పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరానందన్ పుట్టినరోజు, అదే సమయంలో చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురి కావడం.. వెరసి, పవన్ కళ్యాణ్ చాలా చాలా భిన్నమైన ఛాలెంజెస్‌ని ఒకేసారి చూడాల్సి వచ్చింది.
