తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. ఓ రాజకీయ పార్టీ పనిగట్టుకుని, సదరు కొరియోగ్రాఫర్ వ్యవహారంలో అత్యుత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. సందట్లో సడేమియా, ఓ హీరో అభిమానులూ సదరు రాజకీయ పార్టీతో కలిసి, సదరు కొరియోగ్రాఫర్‌ని ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల ఆ కొరియోగ్రాఫర్‌కి నేషనల్ అవార్డ్ వస్తే, అంతకు ముందు అతనితో కలిసి పని చేసిన సదరు హీరో, కనీసం ఆ కొరియోగ్రాఫర్‌ని అభినందిస్తూ ట్వీటేయలేదు. అప్పట్లోనే, ఈ విషయమై అంతా విస్తుపోయారు. ఓ రాజకీయ పార్టీలో కీలకంగా సదరు కొరియోగ్రాఫర్ వ్యవహరించడం, ఆ హీరోకి నచ్చలేదు. ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా మొక్కుబడి ట్వీట్ మాత్రం ఆ హీరో వేశాడనుకోండి.. అది వేరే సంగతి.
కొరియోగ్రాఫర్ వివాదంలో బాధితురాలిగా చెప్పబడుతున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌తో ఆ హీరో ఇప్పుడు వర్క్ చేస్తుండడం గమనార్హం. దాంతో, ఆ కొరియోగ్రాఫర్‌ని ఇరికించేందుకు సదరు హీరోనే, తెరవెనుకాల ఆ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించాడనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
‘ఆమెకు నేను ముందు ముందు మరిన్ని అవకాశాలు ఇస్తాను.. మా బ్యానర్‌లో నిర్మించే సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలిస్తాను..’ అని సదరు హీరో, నేరుగా ఫిలిం ఛాంబర్‌కి సమాచారం ఇచ్చాడట. ఇదంతా చూస్తోంటే, పక్కా ప్లానింగ్‌తోనే సదరు కొరియోగ్రాఫర్‌కి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
తప్పు చేస్తే, శిక్ష అనుభవించి తీరాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కాకపోతే, తప్పు జరిగిందో.. లేదో.. తేలకుండానే, ఇంత యాగీ.. అంటే, అనుమానాలు ఖచ్చితంగా పెరుగుతాయ్.! పైగా, ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తోంది.
కాగా, కొరియోగ్రాఫర్ వెర్షన్ ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌కి చేరింది. బాధితురాలి వెర్షన్ కూడా చేరింది. సో, తప్పెవరిదన్నది తేలాల్సి వుంది. ఈలోగా, తన అభిమాన సంఘాలతో, సదరు కొరియోగ్రాఫర్‌కి వ్యతిరేకంగా, అతను పనిచేస్తున్న పార్టీ మీదా, ఆ పార్టీ అధినేత మీదా.. ఆ హీరో చేయిస్తున్న దుష్ప్రచారం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
పెయిడ్ ప్రోపగాండా నడపడంలో, సదరు అభిమాన సంఘాలకి.. సదరు హీరోకీ పెద్ద ట్రాక్ రికార్డే వుంది.! దాన్నొక ఆర్మీగా సదరు హీరో అభివర్ణిస్తుంటాడనుకోండి.. అది వేరే సంగతి. అధికారం కోల్పోయిన ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకుడికి అత్యంత సన్నిహితుడైన హీరో.. సినీ పరిశ్రమలో ఓ కుటుంబం అంటే గిట్టని కొందరు సినీ ప్రముఖులు.. ఆ సినీ కుటుంబంలోని వ్యక్తి నడుపుతున్న పార్టీ.. ఆ పార్టీలో పనిచేస్తున్న కొరియోగ్రాఫర్.. ఇదంతా చూస్తోంటే, కుట్ర కోణం సుస్పష్టం.
వివాదం ఎటువైపు వెళుతుందో, ఓ నటి కూడా ఈ వ్యవహారంలో తలదూర్చి, తనకూ ఓ దర్శకుడికీ మధ్య నలుగుతున్న వివాదాన్ని సెటిల్ చేయాలని తెరపైకి రావడం కొసమెరుపు.! మరి, ఫిలిం ఛాంబర్ ఆమె విషయాన్నీ టేకప్ చేస్తుందా.? ఆ నటి, పోలీసుల్ని ఆశ్రయిస్తుందా.? ఆమెకీ, సదరు నటుడు తన సినిమాల్లో అవకాశాలిస్తాడా.? వేచి చూడాల్సిందే.