నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఘర్షణాత్మక వాతావరణంలో సాగింది. అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీ శ్రేణుల ప్రవర్తనలో మార్పు కనిపించలేదని ఈ పర్యటన మరోసారి చూపించింది.
జగన్ స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఏర్పాటు చేసిన రోప్ పార్టీని తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. సత్తెనపల్లి, బంగారుపాళ్యం పర్యటనల తరహాలోనే నెల్లూరులో కూడా నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.
జగన్ యాత్రలు పరామర్శ పర్యటనల కంటే బలప్రదర్శనలా కనిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు పరామర్శల పేరుతో ఆయన రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పర్యటనల్లో భారీగా జనాలను తరలించేందుకు పార్టీ నేతలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రయోజనం లేకుండా పోయింది.
నెల్లూరు జైలులో కాకాణిని పరామర్శించిన అనంతరం, జైలు నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కారణంగా సాధారణ ప్రజలు నాలుగున్నర గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తోపులాటలో ప్రసన్నకుమార్ రెడ్డి కూడా కిందపడ్డారు. అదృష్టవశాత్తూ పోలీసులు వెంటనే లాగిపట్టి ప్రమాదాన్ని తప్పించారు.
ఇక ఈ గందరగోళంలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యపై కార్యకర్తలు పడటంతో ఆయన చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనతో నెల్లూరు పర్యటనలో 5 గంటలపాటు హడావిడి నెలకొంది.
